బ్యాంకుల్లో గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా?.. ఒక్కసారి ఆలోచించండి

మీకు గోల్డ్ లోన్ కావాలా? వెంటనే కావాలా? కుదువబెట్టిన బంగారం తక్కువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటున్నారా?


వంటి ప్రకటనలు ఆకట్టుకుంటాయి. ప్రజల ఆర్థిక అవసరాల కోసం గోల్డ్ లోన్లు (Gold Loan) ఒక ఆకర్షణీయ ఎంపికగా కనిపిస్తాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా జారీ చేసిన నూతన నిబంధనలు గోల్డ్ లోన్ తీసుకునే వారికి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. అవి ప్రజల పాలిట పిడుగులా మారాయి. గోల్డ్ లోన్ల చెల్లింపు కాలం, వడ్డీ రేట్లు, ఇతర షరతులు కఠినతరంగా మారాయి. ఒక్కో బ్యాంకులో ఈ నిబంధనలు వేర్వేరుగా అమలవుతున్నాయి. కానీ, రుణగ్రహీతలు ఇకపై జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. వైద్య చికిత్స కోసం, పిల్లల చదువుల కోసం, వ్యాపారం నిమిత్తం, వ్యవసాయ అవసరాల కోసం తీసుకొనే రైతులు, మహిళలు, యువత ఇకపై జాగ్రతగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీసుకున్న అప్పు మొత్తం వడ్డీసహా ఏడాదిలోగా చెల్లించాలంటే యాడికెళ్లి తేవాలని బాధపడవద్దు.

ముందే ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకొని గోల్డ్‌లోను కోసం ముందుకెళ్లాల్సి ఉన్నది. ఎందుకంటే.. ఆర్బీఐ 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు గోల్డ్ లోన్లపై కఠిన నియంత్రణలను తీసుకొచ్చింది. గతంలో గోల్డ్ లోన్ తీసుకుంటే ఏడాదికి ఏడాది రెన్యూవల్ చేసుకొనే సౌలభ్యం ఉండేది. కానీ, ఇప్పుడు దానికి తొలగించారు. 12 నెలలు గరిష్ఠ పరిమితి విధించారు. 12 నెలలు దాటితే కచ్చితంగా రుణంతోపాటు వడ్డీ మొత్తం చెల్లించాల్సిందే. మళ్లీ రుణంగా కూడా అదే రోజు ఇవ్వరు. రుణం చెల్లించిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఆ బంగారం ద్వారా రుణం నిబంధన పెట్టారు.

నిబంధనల్లో కీలక అంశాలు

లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణం పొందవచ్చు. రుణ మొత్తాన్ని వడ్డీతోసహా గరిష్ఠంగా 12 నెలల్లోగా చెల్లించాలి. ఈఎంఐ ఆధారిత రుణాలకు 36 నెలలు వరకు గడువు ఉన్నది. రుణం పునరుద్ధరించాలంటే కూడా కొన్ని షరతులు విధించింది. రుణం స్టాండర్డ్ స్థితిలో ఉండాలి. మొత్తం వడ్డీ చెల్లించబడి, కొత్త క్రెడిట్ అంచనా ఉండాలి. బంగారం విలువ నిర్ధారణ, వేలం ప్రక్రియలో పూర్తి పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. రుణ చెల్లింపు విఫలమైతే, బంగారం వేలం వేస్తారు. ఈ మేరకు రుణగ్రహీతకు సమాచారం ఇస్తారు. ఈ నిబంధనలు రుణగ్రహీతల రక్షణ, పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినవైనప్పటికీ, చెల్లింపు కాలం తగ్గడం, కఠిన షరతులు ప్రజలకు ఆర్థిక ఒత్తిడిని తెచ్చిపెట్టే ప్రమాదం ఉన్నది.

ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ

గోల్డ్ లోన్ల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా బ్యాంకును బట్టి మారుతున్నాయి. కొన్ని బ్యాంకులు 88 శాతం వడ్డీ వేస్తే, మరికొన్ని కొంత ఎక్కువగా, మరికొన్ని తక్కువ వడ్డీలు విధిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు విషయంలో కూడా వివిధ టారీఫ్‌లను కొనసాగిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించకపోగా, మరికొన్ని బ్యాంకులు విధిస్తున్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)

  • వడ్డీ రేటు: 8.85 శాతం-9.6 శాతం (వ్యవసాయ రుణాలకు 8.85 శాతం నుంచి).
  • చెల్లింపు కాలం: బుల్లెట్ చెల్లింపు కోసం 12 నెలలు, ఈఎంఐ కోసం 36 నెలలు.
  • ప్రాసెసింగ్ ఫీజు: రూ. 3 లక్షల వరకు రుణాలకు ఫీజు లేదు, ఆపై 0.50%.
  • ప్రత్యేకత: తక్కువ ప్రాసెసింగ్ ఫీజు మరియు వ్యవసాయ రుణాలకు అనుకూల వడ్డీ రేట్లు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

  • వడ్డీ రేటు: 8.75%-9.45%.
  • చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 36 నెలలు (ఈఎంఐ).
  • ప్రాసెసింగ్ ఫీజు: 0.50% + జీఎఎస్టీ.
  • ప్రత్యేకత: వేగవంతమైన ప్రాసెసింగ్, తక్కువ డాక్యుమెంటేషన్.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

  • వడ్డీ రేటు: 8.50%-9.90%.
  • చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 24-36 నెలలు (ఈఎంఐ).
  • ప్రాసెసింగ్ ఫీజు: 0.50%-1% + జీఎస్టీ.
  • ప్రత్యేకత: డిజిటల్ గోల్డ్ లోన్ సౌకర్యం.

ఐసీఐసీఐ బ్యాంక్

  • వడ్డీ రేటు: 8.75%-9.50%.
  • చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 36 నెలలు (ఈఎంఐ).
  • ప్రాసెసింగ్ ఫీజు: 0.50%-1% + జీఎస్టీ.
  • ప్రత్యేకత: వ్యక్తిగత అవసరాల కోసం ఫ్లెక్సిబుల్ రుణాలు.

కెనరా బ్యాంక్

  • వడ్డీ రేటు: 8.85%-9.25%.
  • చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 36 నెలలు (ఈఎంఐ).
  • ప్రాసెసింగ్ ఫీజు: 0.50% + జీఎస్టీ.
  • ప్రత్యేకత: వ్యవసాయ,వ్యక్తిగత రుణాలకు అనుకూలం.

వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు పోల్చిచూడాలి..

గోల్డ్ లోన్ తీసుకునే ముందు రుణగ్రహీతలు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూడాలి. ఏది మనకు అనుకూలంగా ఉంటుందో అంచనా వేసుకొని ఆ బ్యాంకులోనే రుణం తీసుకోవాలి. రుణం చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. లేదంటే బంగారం వేలం వేయబడే ప్రమాదం ఉంటుంది. తీసుకున్న రుణం ఎంత? వడ్డీ ఎంత? ఈఎంఐ ఎంత? మొత్తం పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బీఐ నూతన నిబంధనలు గోల్డ్ లోన్‌లను మరింత క్రమబద్ధీకరించినప్పటికీ, రుణగ్రహీతలు తమ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే, బంగారం కోల్పోవడంతో పాటు ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.