దక్షిణ భారత దేశంలో ఫేమస్ టిఫిన్ అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోస. ఈ అల్ఫారాలను తయారు చేసుకోవడం చాలా సులభం, ఆరోగ్యకరం. అయితే సరికొత్తగా ఇడ్లీలను తయారు చేసుకోవాలనుకుంటే చిల్లీ ఇడ్లీను ట్రై చేయండి. ఈ చైనీస్ ఇడ్లీలను కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడే చైనీస్ ఫుడ్ చిల్లీ ఇడ్లీను ఇంట్లోఎలా తయారు చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..
పిల్లలు ఎప్పుడూ బయటి ఆహారం తినడానికి ఇష్టపడతారు. అయితే కుటుంబ సభ్యులు ఎప్పుడూ బయటి ఆహారం తినవద్దు అని చెబుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో బయట తయారు చేసే ఆహారాన్ని తినడం చాలా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే.. కొన్ని నిమిషాల్లో బయట లభించే చైనీస్ ఆహారాన్ని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా..! ఇలా ఇంట్లో చేసుకునే ఫుడ్ రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజు కొన్ని నిమిషాల్లో సిద్ధంగా చేసుకునే టేస్టీ టేస్టీ చైనీస్ ఇడ్లీ తయారీ గురించి తెలుసుకుందాం. పిల్లలు ఇష్టపడే చైనీస్ చిల్లీ ఇడ్లీను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే..
చైనీస్ చిల్లీ ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
సెమోలినా (సుజీ రవ్వ) – 200 గ్రాముల
పెరుగు -100 గ్రాముల
క్యాప్సికమ్- 1 కప్పు ముక్కలు
ఉల్లిపాయ – 1 కప్పు ముక్కలు
పచ్చి మిరపకాయ-1 సన్నగా తరిగినది
వెనిగర్ – 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
టమోటా సాస్ – 1 టేబుల్ స్పూన్
చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కారం – 1 స్పూన్
కొత్తిమీర- సన్నగా తరిగిన
వంట సోడా – 1 స్పూన్
నూనె – తగినంత.
తయారీ విధానం:
- మొదటి దశ: ముందుగా మనం ఇడ్లీని సిద్ధం చేసుకోవాలి. దాని కోసం సుజీ రవ్వ, పెరుగు, కొంచెం ఉప్పు, వంట సోడాను వేసి వీటిని బాగా కలిపి ఒక పక్కన పెట్టాలి. ఇలా చేయడం వలన పిండి ఉబ్బుతుంది. ఇంతలో తీసుకున్న కూరగాయలను కోసి పక్కన పెట్టుకోవాలి. దీని తరువాత అన్ని సాస్‌లను ఒక గిన్నెలో కలుపుకోవాలి.
- రెండవ దశ: ఇప్పుడు ఇడ్లీ పాత్రని తీసుకుని గిన్నెలో నీటిని పోసి.. గ్యాస్ మీద పెట్టి నీటిని వేడి చేయాలి. అదే సమయంలో ఇడ్లీ ప్లేట్స్ లో రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి.. ఆవిరి మీద ఉడికించండి. ఇలా 10 నిమిషాలు నుంచి 18 నిముషాలు ఇడ్లీని ఉడికించండి.
- మూడవ దశ: ఇడ్లీ సిద్ధం అయ్యాక ఇడ్లీలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి చేయండి. దీని తర్వాత తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించండి. తర్వాత తీసుకున్న అన్ని కూరగాయల ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు మొదలైనవి ఒక్కొక్కటిగా వేసి వేయించండి.
- నాల్గవ దశ: ఈ కూరగాయల ముక్కలను తేలికగా వేయించిన తర్వాత.. దానికి వెనిగర్ వేసి కొంతసేపు కలపండి. దీని తరువాత కలుపుకున్న సాస్ మిశ్రమాన్ని జోడించండి.
- ఐదవ దశ: లైట్ గ్రేవీ సిద్ధమైన తర్వాత.. ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసి ఈ గ్రేవీలో వేయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉప్పు వేసి బాగా కలపండి. దీని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడి వేడిగా పిల్లలకు చైనీస్ చిల్లీ ఇడ్లీలను అందించండి.
ఈ ఇంట్లో తయారుచేసిన చైనీస్ చిల్లీ ఇడ్లీని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. ఇది ఆరోగ్యకరమైనది. రుచికరమైనది.




































