బ్రెడ్ అనేది పెద్ద నగరాలతో పాటు గ్రామాలు, పట్టణాలలో కూడా లభించే సులభమైన అల్పాహారం. కానీ ఇది శారీరక, మానసిక అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు. రోజూ బ్రెడ్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి.. దానిని నివారించడానికి ఏమి చేయాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ విషయాలను తెలుసుకుందాం.
నేటి బిజీ జీవితంలో.. బ్రెడ్ అనేది అత్యంత సులభమైన అల్పాహారం.. ఎక్కడైన ఈజీగా దొరుకుతుంది.. వాస్తవానికి ఈ బ్రెడ్ త్వరగా తయారవుతుంది.. అనేక రుచులతో లభిస్తుంది.. అందుకే.. బ్రెడ్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనదిగా మారింది. నేడు చాలా మంది తమ ఉదయం బ్రెడ్-జామ్ లేదా బ్రెడ్-బటర్ వంటి అల్పాహారంతో ప్రారంభిస్తారు. కానీ సులభంగా లభించడంతోపాటు.. ఎల్లప్పడూ సిద్ధంగా ఉండే ఈ బ్రెడ్ కూడా అనేక సమస్యలకు కారణం అవుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ బ్రెడ్ తినే వ్యక్తులు శారీరకంగానే కాకుండా మానసిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
బ్రెడ్‌లో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది.. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రెడ్‌లో ఫైబర్ – విటమిన్ E లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రెడ్‌లో ఉండే గ్లూటెన్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు మలబద్ధకం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. అధిక మొత్తంలో కేలరీలు, కార్బోహైడ్రేట్ల కారణంగా, ఎక్కువ బ్రెడ్ తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతుంది. ఇది కాకుండా, రోజూ బ్రెడ్ తినడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతుంది. బ్రెడ్‌లో అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు, రసాయనాలు కలుపుతారు. ఇది శరీర జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రెడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ నిరాశ, ఒత్తిడి, ఏకాగ్రత లేకపోవడం వంటి మానసిక సమస్యలను కలిగిస్తాయి. బ్రెడ్‌ను నిరంతరం తినడం వల్ల శరీరంలో మంట కూడా వస్తుంది. ఇది మెదడు పనితీరు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
రోజూ బ్రెడ్ తినడం వల్ల ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి, ఈస్ట్‌ను బ్రెడ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. రోజూ బ్రెడ్ తినడం వల్ల కడుపులో ఈస్ట్ పరిమాణం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, కడుపులో ఉండే బ్యాక్టీరియా బ్రెడ్‌లో ఉండే కార్బోహైడ్రేట్‌లను జీర్ణం చేసినప్పుడు, కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. దీని కారణంగా ఆల్కహాల్ అంటే ఇథనాల్ కడుపులో ఏర్పడుతుంది. దీని కారణంగా రోగి మద్యం తాగకుండానే మత్తు వంటి లక్షణాలను అనుభవిస్తాడు. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి.. ఇది ఎక్కువగా బ్రెడ్ తినే వారికి సంభవించవచ్చు.
మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?
మీ రోజువారీ ఆహారంలో బ్రెడ్‌ను భాగం చేసుకోకండి. బదులుగా, మీ అల్పాహారంలో గోధుమ రోటీ, గంజి, ఉప్మా, పోహా వంటి వాటిని చేర్చుకోండి.
తాజా పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు, పప్పుధాన్యాలు తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో తగినంత ఫైబర్ – పోషకాలు ఉంటాయి.
మార్కెట్ నుంచి బ్రెడ్ కొంటున్నప్పుడు, అందులో ఉన్న పదార్థాలను పరిశీలించండి.. వీలైతే హోల్ వీట్, మల్టీ గ్రెయిన్ లేదా ప్రిజర్వేటివ్స్ లేని బ్రెడ్‌ను ఎంచుకోండి.
మీకు కడుపు లేదా మెదడుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
































