బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కాజోల్.. హైదరాబాద్‌లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అదో భయంకరమైన ప్రదేశమని, జీవితంలో మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది.
అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్.. ప్రస్తుతం ‘మా’ అనే సినిమా చేసింది. జూన్ 20న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చింది. ‘ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపెడతాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి రాకూడదు అనిపిస్తుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అది’ అని కాజోల్ చెప్పింది.
మరి కాజోల్‌ని అంతలా భయపెట్టిన సంఘటన ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. కాజోల్ కెరీర్ విషయానికొస్తే.. 1992 నుంచి సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ క్లాసిక్స్‌లో ఒకటైన ‘దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే’ సినిమాలో హీరోయిన్ ఈమె. తర్వాత కూడా పలువురు స్టార్స్‌తో మూవీస్ చేసింది. కొన్నాళ్లకు హీరో అజయ్ దేవగణ్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ టైంలో సలాం వెంకీ, లస్ట్ స్టోరీస్ 2, దో పత్తి తదితర చిత్రాలతో కాజోల్ ఆకట్టుకుంది. ఇప్పుడు ‘మా’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
































