వికటించిన కాస్మెటిక్ శస్త్ర చికిత్స.. గాయని మృతి

సౌందర్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఎంచుకున్న చర్య దురదృష్టవశాత్తు మృత్యువుకు దారితీసింది. ప్రముఖ మొజాంబిక్ గాయకురాలు, సోషల్ మీడియాలో విస్తృతంగా గుర్తింపు పొందిన అనా బార్బరా బుల్ద్రిని (31) టర్కీలో శస్త్రచికిత్స తర్వాత ఆకస్మికంగా మృతి చెందారు.


ఈ ఘటన ఇస్తాంబుల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

అనా బుల్ద్రిని ఈసారి టర్కీకి రొమ్ముల పెంపు, లైపోసక్షన్, ముక్కు ఆకృతిని మార్చే కాస్మెటిక్ సర్జరీల కోసం ప్రయాణించారు. అక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడంతో పాటు, ఆమె ద్వారా తమ క్లినిక్‌కు ప్రచారం లభించాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

అయితే, శస్త్రచికిత్సలు పూర్తయిన కొన్ని గంటల్లోనే ఆమె ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా విషమించి, గుండె ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఎల్గార్ సుయెయా తెలిపిన వివరాల ప్రకారం.. సర్జరీకి ముందుగా సరైన పరీక్షలు జరగకపోవడం, ఖచ్చితమైన షెడ్యూల్ పాటించకపోవడం, భోజనం చేసిన వెంటనే ఆపరేషన్ చేయడం వంటివే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని ఆయన ఆరోపించారు.

ఈ ఆసుపత్రికి గతంలోనూ అనేక వివాదాలు ఎదురైనట్లు తెలుస్తోంది. గతంలో మరణ ఘటనలతో పేరుపడటంతో, ఇటీవలే ఆసుపత్రి పేరును కూడా మార్చినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ, అన్ని అవసరమైన వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఆపరేషన్ చేశామని పేర్కొంది. అయితే, అనూహ్యంగా హృదయ సంబంధిత రుగ్మత తలెత్తి, తీవ్ర శ్రమ చేసినా ఆమెను కాపాడలేకపోయామని వెల్లడించింది. గుండెలో తతంగత గందరగోళం (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్) వల్ల గుండెపోటు వచ్చిందని, దాదాపు 90 నిమిషాల పాటు ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని వెల్లడించారు.

ప్రస్తుతం ఈ ఘటనపై అధికారిక విచారణ కొనసాగుతోంది. తుది నివేదిక వెలువడేంతవరకూ, బుల్ద్రినీ మరణానికి గల ఖచ్చిత కారణాలు వెల్లడికావు. అయినప్పటికీ, ఈ ఘటన కాస్మెటిక్ సర్జరీల భద్రతపై, అంతర్జాతీయ వైద్య పర్యటనలపై తీవ్ర చర్చను రేకెత్తించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.