What Causes Joint Pain Besides Age:పెద్ద వయసులోనూ దృఢంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే కీళ్లు, ఎముకల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. చాలామందిని 40-45 సంవత్సరాల వయసులోనే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి.
అందువల్ల వయసు పెరుగుతోంది కదా ఇలాంటి సమస్యలు సర్వసాధారణమని సర్దిచెప్పుకుంటారు. కానీ, ప్రస్తుతం యువత సైతం ఈ సమస్యకు బలవుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే ఏంటంటే, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు కేవలం వయసు వల్లే కాదు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కూడా అని అర్థమవుతుంది. ప్రధానంగా దినచర్యలో అనుసరించే ఈ కింది అలవాట్లే కీళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. మరి, అవేంటో చూద్దాం.
వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 40-45 సంవత్సరాల తర్వాత చాలా మందికి మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తాయి. ముఖ్యంగా ఎముకల కోత, ఎముక సాంద్రత తగ్గడం, శరీరంలో కాల్షియం లేదా ఇనుము తక్కువగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఇది తరచుగా వృద్ధాప్యంలో వచ్చే సర్వసాధారణ సమస్య అనే అనుకుంటారు. చాలామందికి తెలియని విషయమేంటంటే, మోకాళ్ల నొప్పులు వయస్సు వల్లే కాదు. మన చెడు అలవాట్ల వల్ల కూడా వస్తాయి. కాబట్టి, కీళ్ల నొప్పులకు కారణమేమిటో.. ఎలా నివారించాలో తెలుసుకోండి.
కీళ్ల నొప్పులకు కారణాలు ఏమిటి?
అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, విటమిన్ డి, కాల్షియం లోపం, ఎముకల సాంద్రత తగ్గడం వల్ల నడుము నొప్పి, మోకాలి నొప్పి సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనితో పాటు మన అలవాట్లలో కొన్ని కూడా మోకాలి నొప్పికి ప్రధాన కారణం. కీళ్ల నొప్పి సమస్య బయటపడటానికి దాదాపు 5-10 సంవత్సరాలు పడుతుంది. ఈ కింది 7 అలవాట్లు మీ కీళ్ల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయి.
ఎక్కువసేపు కూర్చోవడం
పని ఒత్తిడి కారణంగా చాలా మంది ఒకే చోట బలవంతంగా 8 గంటలకు పైగా కూర్చుని పని చేస్తారు. మధ్య మధ్యలో లేచి శరీరానికి కొంచెం విశ్రాంతి కూడా ఇవ్వలేని పరిస్థితిలోనే పనిచేస్తుంటారు. దీనివల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు. ఇది వెన్నునొప్పి, మోకాలి నొప్పికి దారితీస్తుంది. కాబట్టి, పని మధ్యలో ప్రతి అరగంటకోసారి లేచి 5 నిమిషాలు అటూ ఇటూ నడవటం అవసరం. అప్పుడు శరీరం, కాళ్లు తేలికపడతాయి.
సరైన భంగిమలో కూర్చోకపోవడం
పని చేసేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు సౌకర్యవంతమైన స్థితిలో కూర్చుంటే మెడ నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. పాదాలు నేలను సమానంగా తాకేలా.. మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా కూర్చోవడం సరైన పద్ధతి. ఇదే కాకుండా, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు.
లేచి కదలకపోవడం
కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు. దీనివల్ల మోకాళ్ల నొప్పి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి 20 నుండి 30 నిమిషాలకు లేచి కదలండి లేదా మోకాళ్లకు సరిపోయే తేలికపాటి వ్యాయామం చేయండి. ఇది కీళ్లపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడం
వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. కొంతమంది వర్కవుట్లను నిర్లక్ష్యం చేస్తారు. మోకాలు, తుంటి భాగం, వెన్నెముకను బలోపేతం చేయడానికి తగిన వ్యాయామాలు చేయడం చాలా అవసరం.
కొల్లాజెన్ తీసుకోకపోవడం
శరీరానికి ముఖ్యమైన ప్రోటీన్లలో కొల్లాజెన్ ఒకటి, ఇది చర్మం, ఎముకలు, గోర్లు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు గనక కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోతే కచ్చితంగా కీళ్ల నొప్పులు వస్తాయి. అందువల్ల కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు తప్పనిసరిగా కొల్లాజెన్ అధికంగా ఉండే ఆహారం లేదా సప్లిమెంట్లు తీసుకోవాలి.
అనారోగ్యకరమైన ఆహారం
చక్కెర ఉన్న ఆహారాలు, నూనె పదార్థాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం కూడా మోకాలి నొప్పికి కారణాలు. ఈ ఆహారాలు కీళ్ల వాపును కూడా పెంచుతాయి. కాబట్టి, ఇటువంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి.
































