కల్పబుల్‌ హోమీసైడ్‌ కింద జగన్‌పై కేసు

నేర నిరూపణైతే జీవిత ఖైదు విధించొచ్చు..బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 105 చెప్పేది ఇదే..


ఈనాడు, అమరావతి: వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహన చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు తాజాగా బీఎన్‌ఎస్‌ 105, 49 సెక్షన్లను చేర్చారు.

బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్‌ అంటే.. హత్య కిందకు రాని కల్పబుల్‌ హోమీసైడ్‌ (కల్పబుల్‌ హోమీసైడ్‌ నాట్‌ ఎమౌంటింగ్‌ టు మర్డర్‌). ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్‌ పెడతారు. జగన్‌మోహన్‌రెడ్డి సహా మిగతా నిందితులపై ఈ సెక్షనే పెట్టారు.

నేర నిరూపణ జరిగితే ఈ సెక్షన్‌ కింద జీవిత ఖైదు విధించొచ్చు. నేర తీవ్రతను బట్టి 5-10 ఏళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్‌ బెయిల్‌బుల్‌ సెక్షన్‌. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బీఎన్‌ఎస్‌ 49 సెక్షన్‌ను ఈ కేసులో చేర్చారు.

తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ బీఎన్‌ఎస్‌ 106(1)) సెక్షన్‌ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్‌ దృశ్యాలన్నింటినీ విశ్లేషించటంతో.. ఇది కల్పబుల్‌ హోమీసైడేనని నిర్ధారణకు వచ్చి.. ఈ సెక్షన్‌ జత చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.