‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు

‘శ్వాస మీద ధ్యాస’.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, స్వస్థతను ప్రసాదించే ధ్యానానికి అద్భుత సాధనం అన్న విషయం మనకు తెలుసు. ఇది కేవలం నమ్మకం కాదని, అక్షరాలా సత్యమని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం చూపే అధ్యయన ఫలితం వెలువడింది.


‘వేలి ముద్ర’ మాదిరిగానే ప్రతి మనిషికీ విలక్షణమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడిన ‘శ్వాస ముద్ర’ ఉంటుందట! ఆలోచనలపరంగా, ఆరోగ్యపరంగా మీరేమిటో చెప్పాలంటే మీ విలక్షణమైన ‘శ్వాస ముద్ర’ను చూస్తే చాలు అనే పరిస్థితి మున్ముందు రావచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు!!-సాక్షి సాగుబడి

ఇజ్రాయెల్‌లోని వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్‌ నోమ్‌ సోబెల్, ఆయన బృందం.. శ్వాస తీరుతెన్నులకు, వ్యక్తుల భావోద్వేగాలూ ఆరోగ్య స్థితిగతులకూ ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై అధ్యయనం చేశారు. ఆశ్చర్యకరమైన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల ‘కరెంట్‌ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

96.8% ‘ప్రత్యేకం’
ఈ అధ్యయనంలో భాగంగా 100 మందిని ఎంపిక చేసి, 24 గంటల పాటు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నమోదు చేసి, విశ్లేషించారు. నాసికా రంధ్రాల బయట పట్టుకొని ఉండే సెన్సార్లతో కూడిన పరికరాన్ని వారికి అమర్చారు. వారు నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా అనుక్షణం వారి శ్వాస తీరుతెన్నులను 24 గంటల పాటు నమోదు చేశారు. దీనితో పాటు వారికి ప్రశ్నావళిని కూడా అందించి, వారి అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు. ప్రతి వ్యక్తీ 96.8% మేర తనదైన విలక్షణ శైలిలో శ్వాసిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొందరు నిచ్ఛ్వాస తర్వాత తిరిగి శ్వాస తీసుకునే ముందు కొద్ది విరామం తీసుకున్నారు. మరికొందరు వెనువెంటనే లేదా ఇతరులకన్నా ముందే శ్వాస తీసుకున్నారు. ఎవరి తీరు వారిదే అన్నట్లు శ్వాస తీరుతెన్నులు ఉండటం విశేషం.

అనారోగ్యాలు పసిగట్టేందుకూ..
వ్యాకులత తదితర అంశాలపై వారు వ్యక్తపరచిన అభిప్రాయాలకు, వారి శ్వాస తీరుతెన్నులకు మధ్య సారూప్యత కనిపించింది. దీంతో, మనుషుల మానసిక స్థితిగతులను, అనారోగ్య సమస్యలను, రుగ్మతలను పసిగట్టేందుకు వారి శ్వాస తీరుతెన్నులు ఉపయోగపడతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఒక్కరి మెదడు మాత్రమే కాదు, వారి శ్వాస తీరుతెన్నులు కూడా విలక్షణమైనవే’ అనిపిస్తోందన్నారు వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో న్యూరో బయాలజీ ప్రొఫెసర్‌ నోమ్‌ సోబెల్‌. ఈ అధ్యయనంలో పాల్గొన్న వంద మందిలో 42 మంది శ్వాస ప్రక్రియను మరో 24 గంటలు అదనంగా అధ్యయనం చేశారు. ‘ఒకరు రన్నింగ్‌ చేస్తారు. మరొకరు చదువుకుంటుంటారు. ఇంకొకరు విశ్రమిస్తుంటారు. వీరి శ్వాస తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని గుర్తించటం చాలా కష్టమేమో అని ముందు అనుకున్నాం. అయితే, ఒకరి శ్వాస తీరుతెన్నులతో మరొకరిది చాలా విభిన్నంగా ఉండటం గమనించాం’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక విద్యార్థి తిమ్న సరోక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

వ్యాకులత.. తక్కువ గాలి!
వారి శ్వాస తీసుకుంటున్న తీరు, నిద్రకు ఉపక్రమించటం-మేల్కొనటం, మనోవ్యథ, వ్యాకులతకు సంబంధించిన భావోద్వేగాలను బట్టి ఆయా వ్యక్తుల బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బిఎంఐ)ను సైతం పరిశోధకులు అంచనా వేయగలగటం మరో విశేషం. అధ్యయనంలో భాగంగా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాసినప్పుడు వ్యాకులతను కనబరిచిన వ్యక్తులు చాలా తక్కువగా గాలి పీల్చుకున్నారు. అంతేకాదు, నిద్రలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య వచ్చిన విరామంలో చాలా హెచ్చు తగ్గుల్ని పరిశోధకులు గుర్తించారు. మనోవ్యథతో బాధపడుతున్న వారు మేల్కొని ఉన్నప్పుడు చాలా బలవంతంగా శ్వాసను తీసుకోవటం, గాలి వదిలిన తర్వాత తిరిగి శ్వాస తీసుకోవటానికి ముందు సుదీర్ఘంగా విరామం (పాజ్‌) ఇస్తుండటాన్ని పరిశోధకులు గుర్తించారు.

ఆయురారోగ్యాలకోసం..
‘ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడేవారి శ్వాస తీరుతెన్నులు మారి పోతున్నాయని మేం భావిస్తున్నాం. దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మీరు శ్వాస తీసుకునే తీరును బట్టి మీకు ఒత్తిడి లేదా ఆందోళన వస్తున్నాయని కూడా అనుకోవచ్చు. అదేగనక నిజమైతే, ఆ రుగ్మతల నుంచి బయటపడేయటానికి శ్వాసించే తీరును మార్చితే సరిపోతుందని అనుకుంటున్నాం’ అన్నారు నోమ్‌ సోబెల్‌. శ్వాస మీద ధ్యాస పెడితే ఆయురారోగ్యాలు సమకూరుతాయంటే ఇదేనేమో!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.