ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తృప్తి క్యాంటీన్లను ప్రారంభించాలని భావిస్తోంది.
పేద మధ్య తరగతి ప్రజల కోసం అన్నా క్యాంటీన్లతో పాటు ఇప్పుడు డబ్బులు చెల్లించుకోగలిగే వారికి రుచికరమైన భోజనం అందించేందుకు తృప్తి క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. నగరంలో ఐదు ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చింది. మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకు మంచి ఫుడ్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంటీన్లలో చికెన్ తో పాటు మటన్ బిర్యానీలు సైతం అందుబాటులో ఉంటాయి. సారా అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యమై ఈ ప్రాజెక్టులను రూపొందించింది.
ఐదు సెంటర్లలో
విశాఖ నగరం( Visakha City ) శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకే ఇక్కడ సౌకర్యాల కల్పన పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. ఆర్కే బీచ్ బస్ స్టాప్, కేజీహెచ్, ద్వారక బస్టాండ్, కూర్మన్నపాలెం దగ్గర ఈ క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటుకు స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్కే బీచ్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే చాలా రకాల హోటల్లు ఉన్నాయి. దీంతో అక్కడ తృప్తి క్యాంటీన్ లకు సందర్శకులు వచ్చే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. కేజీహెచ్ సమీపంలో అన్నా క్యాంటీన్ ఉందని.. అక్కడకు కూతవేటు దూరంలో ఉండే బీచ్ రోడ్ స్టాప్ వద్ద తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం తగదన్నారు. నగరంలోని వేరే రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానిక నేతలు సూచిస్తున్నారు.
కంటైనర్ లో నిర్వహణ
అయితే ఈ క్యాంటీన్ అనేది శాశ్వత నిర్మాణం కాదు. కంటైనర్( container) తరహాలో దీనిని ఏర్పాటు చేస్తారు. సారా సంస్థతో పాటు మహిళలు తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుకు పెట్టుబడి పెడతారు. ఈ క్యాంటీన్లకు సంబంధించి ఒక్కో మహిళ రెండు లక్షల 75 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. నలుగురు మహిళలు కలిసి 10 లక్షల పెట్టుబడి పెట్టాలి. మిగతా మూడున్నర లక్షల రూపాయలు సారా సంస్థ అందిస్తుంది. ఈ క్యాంటీన్ల ఏర్పాటులో భాగంగా మహిళలకు రుణ సదుపాయం కూడా ఉంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆ బాధ్యతలను తీసుకుంటుంది. ఈ క్యాంటీన్ కు సంబంధించి కంటైనర్ ఏర్పాటు చేసే స్థలానికి జీవీఎంసీకి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. త్వరలో దీనిపై మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇక్కడ లభించే ఆహార పదార్థాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ టిఫిన్ తో పాటుగా చికెన్, మటన్ బిర్యానీలు అందుబాటులో ఉంటాయి.
తొలుత నెల్లూరులో
నెల్లూరు నగరంలో తృప్తి క్యాంటీన్లు( Trupti canteens ) అందుబాటులోకి వచ్చాయి. కొద్ది నెలల కిందట ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు విశాఖలో విస్తరించేందుకు నిర్ణయించారు. మిగతా నగరాల్లో సైతం వీటి ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వారికి బ్యాంకుల రుణాలు ఇప్పించి ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయిస్తున్నారు. తప్పకుండా ఇవి సక్సెస్ అవుతాయని భావిస్తున్నారు.
































