ఏపీ ప్రభుత్వం మరో పధకం అమలుకు తుది కసరత్తు చేస్తోంది. అన్నదాత సుఖీభవ నిధుల జమ కు వీలుగా అర్హుల జాబితా సిద్దం చేసింది. ఈ నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, ఈ పథకం అర్హుల జాబితాను ఖరారు చేసారు. జాబితాలో పేర్లు లేని వారికి వ్యవసాయ కీలక సూచన చేసింది. అర్హతకు సంబంధించి సమస్యల పరిష్కారానికి రేపు (శనివారం) నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు.
కీలక నిర్ణయం
ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు పై కీలక ప్రకటన చేసింది. ఈ పథకానికి అర్హుల జాబితాలను ప్రభుత్వం పోర్టల్ లో అందుబాటులో ఉంచింది. వీటి పైన అభ్యంతరాలు.. అర్హత కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి శనివారం నుంచి రైతుసేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ఈ రోజు) శుక్రవారం) విడుదల చేస్తామని చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో డేటా సరిచేయించుకోకపోతే.. అన్నదాత-సుఖీభవ-పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు. భూ ఖాతాదారు చనిపోయిన సందర్భంలో వెబ్‌ల్యాండ్, అడంగల్, 1బీల్లో వారసత్వ వివరాలు చేర్చకపోయినా సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అర్హుల జాబితా
కాగా, ఆటోమ్యూటేషన్ గ్రామాల్లో 5 వేలపైన సిరీస్ ఖాతాలను క్షేత్రస్థాయి సిబ్బంది నోషనల్‌గా భావించే అవకాశం ఉండటం, సాంకేతిక లోపంతో వాస్తవంగా భూమి ఉన్నా.. ఎలాంటి భూమి లేని ఖాతాలుగా నమోదవడం, డేటా లోపాలతో విస్తీర్ణం కనిపించకపోవడం వంటి సమస్యలపై గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం విషయంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అంశాలపై వ్యవసాయ అధికారులు పూర్తిఅవగాహన కలిగి ఉండాలని సూచించారు. రైతులు పోర్టల్ లోనూ తమ అర్హత గురించి సమాచారం పొందే అవకాశం కల్పించారు. రైతులు ఆధార్ నంబర్ ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. అనర్హులైన రైతులు 155251 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేసారు.
రైతుల ఖాతాల్లో జమ
ఈ నెలలో కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ నిధుల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కేంద్రం నుంచి రూ 2 వేలు.. ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు మొత్తంగా రూ 7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. లబ్దిదారుల జాబితాను ముందుగానే అందుబాటులోకి తేవటంతో.. ఎవరికీ నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో, ఈ రోజు రైతులు తమ అర్హత గురించి సమస్యలు ఉంటే పరిష్కరించుకునేలా అవకాశం కల్పించారు. వచ్చే వారం ఈ నిధులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
































