ఇంటర్‌ బోర్డ్‌ ఎత్తేద్దామా?

 పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యను ఒకే గొడుగు కిందకు తేవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇంటర్‌ బోర్డ్‌ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను రాష్ట్రాల ముందు ఉంచింది. తాజాగా ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు.


జాతీయ విద్యా విధానం అమలే ఎజెండాగా జరిగిన ఈ సమావేశంలో ఇంటర్, టెన్త్‌ బోర్డుల విలీనపై చర్చ జరిగింది. వివిధ రాష్ట్రాల్లోని విద్యా విధానాలు, పరిస్థితులను కేంద్ర అధికారులు వివరించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రతిపాదనకు సహకరించాలని కోరారు. ఈ చర్చల సారాంశాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సీఎం కార్యాలయానికి గురువారం తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.

రాష్ట్రాల్లోనూ కేంద్ర విధానం..!
కేంద్ర విద్యా సంస్థల్లో 12వ తరగతి వరకు బోర్డ్‌ ఒకటే ఉంటుంది. బోధనాంశాలు, నిర్వహణ, నిర్ణయాలు అన్నీ ఒకేరకంగా ఉంటాయి. రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. పాఠశాలల్లో పదో తరగతి వరకే బోధన ఉంటుంది. టెన్త్‌ ఉత్తీర్ణులు ఇంటర్‌ కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంటర్‌ బోర్డ్‌ పరిధిలోకి విద్యార్థి వస్తాడు. కేంద్ర, రాష్ట్ర విద్యా సంస్థల మధ్య ఈ తేడా సరికాదన్నది నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ ఉద్దేశం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే బోర్డ్‌ పరిధిలోకి స్కూల్, ఇంటర్‌ విద్యను తేవాలని కేంద్రం సూచించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్స్‌ విధానం అనుసరిస్తున్న నేపథ్యంలో 12వ తరగతి వరకు ఈ విధంగానే ఉండాలనే ప్రతిపాదన చేస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం కూడా హెచ్‌ఎస్‌ఎల్‌సీ ఉండేది. 12వ తరగతి వరకు ఒకటే స్కూల్‌లో బోధన చేసేవారు. ఆ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లేవాళ్లు.

డ్రాపౌట్స్‌ తగ్గించవచ్చా?
ఒకే బోర్డ్‌ పరిధిలో 12వ తరగతి వరకు ఉండటం వల్ల విద్యార్థుల డ్రాపౌట్స్‌ తగ్గించవచ్చని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల మందికిపైగా టెన్త్‌ పరీక్షలో అర్హత సాధిస్తున్నారు. ఇంటరీ్మడియట్‌ రెండు సంవత్సరాల తర్వాత ఉత్తీర్ణులయ్యేవారు 4 లక్షల లోపే ఉంటున్నారు. వీళ్లలో 3 లక్షల మంది ఉన్నత విద్యకు వెళ్తున్నారు.

టెన్త్‌ నుంచి ఇంటర్‌కు వెళ్లే విద్యార్థులు మధ్యలోనే విద్య మానేస్తున్నారా? లేదా ఇంకేమైనా నేర్చుకుంటున్నారా? అనే సమగ్ర వివరాలు విద్యాశాఖ వద్ద లేవు. ఇటీవల సీఎం సమీక్షలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఒకే క్యాంపస్‌లో 12వ తరగతి వరకు విద్యార్థి కొనసాగితే మధ్యలో మానేసే అవకాశం ఉండదని కేంద్రం భావిస్తోంది.

దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లోనే టెన్త్, ఇంటర్‌ బోర్డులు వేర్వేరుగా ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇంటర్‌ బోర్డ్‌ కాకుండా సెకండరీ గ్రేడ్‌ విద్యా విధానం అమలు చేస్తున్నారు. దీనివల్ల డ్రాపౌట్స్‌ తగ్గుతున్నాయని కేంద్ర విద్యా శాఖ రాష్ట్రాలకు తెలిపింది.

నిర్ణయం చెబుతాం
ఒకే బోర్డ్‌ ఉండాలనే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. సమావేశంలో వాళ్లు చెప్పిన అంశాలన్నీ విన్నాం. సాధ్యాసాధ్యాలను ప్రభుత్వానికి వివరిస్తాం. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. త్వరలో సమావేశ వివరాలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తాం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.