అధికారంలోని ఎన్డీయే సర్కార్‌కు ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జేఏసీగా ఏర్పడిన ప్రభుత్వ ఉద్యోగులు కీలకమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆల్టిమేటం జారీ చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రూట్ మ్యాప్ ప్రకటించాలని.. తక్షణమే పీఆర్సీ కమిషనర్ నియామకం చేపట్టాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. పెండింగ్ డీఏలను సత్వరమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల అసంతృప్తి అర్థం చేసుకోవాలని.. తమ సమస్యలపై దృష్టి సారించాలని ఏపీ ఏన్జీఓ జేఏసీ చైర్మన్ ఎ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నూతన చైర్మన్‌గా విద్యాసాగర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా డీవీ రమణ ఎన్నిక జరిగింది. ఎన్నిక అనంతరం ఎన్జీఓ హోమ్‌లో జరిగిన సమావేశంలో విద్యాసాగర్, డీవీ రమణ మాట్లాడారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గత ప్రభుత్వం పెట్టిన రూ.27 వేల కోట్లు బకాయిలను చెల్లించాలని జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే మూడు డీఏలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని జూలైలో నాలుగో డీఏ ప్రకటించాల్సి ఉందని గుర్తుచేశారు. కీలక రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నూతన పీఆర్సీ కమిషనర్ నియామకం, డీఏల మంజూరు, సరెండర్ లీవ్‌ల చెల్లింపు, క్వాంటమ్ పెన్షన్ విధానంలో మార్పులు, ఉద్యోగుల ఆరోగ్య సేవల కోసం ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న నిధులను సరాసరి ఆసుపత్రుల ఖాతాకు జమ చేసేలా మార్పులు చేయటం వంటి డిమాండ్లు ఏపీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.
ఇతర డిమాండ్లు
పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో ఈ అవకాశం సహకార, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు వర్తింపచేయాలి.
కరోనా సమయంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో కారుణ్య నియామకాలు చేపట్టాలి.
































