ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పాస్ పుస్తకాల ఇచ్చేందుకు ముహుర్తం ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం వెల్లడించారు.
వివరాలు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రోజున రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో చర్చించిన అంశాలను వెల్లడించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రెవెన్యూ శాఖలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడంతోపాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన విధానాలపై సీఎం చంద్రబాబు చర్చించారని మంత్రి అనగాని తెలిపారు. గత ప్రభుత్వం భూముల రీ సర్వే సరిగా చేయలేదని విమర్శించారు. కేవలం ఫొటోల పిచ్చితో రీసర్వే చేశారని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు. ఎవరికి అన్యాయం జరగకుండా, హక్కులకు భంగం లేకుండా పారదర్శకంగా భూ సర్వే జరుగుతుందని తెలిపారు. సాంకేతికత సాయంతో భూ వివాదాలు, సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మోస పూరితమైన రిజిస్ట్రేషన్లకు, ఎంట్రీలకు అడ్డుకట్ట వేయనున్నట్టుగా చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు 15న పంపిణీ చేయనున్నట్టుగా తెలిపారు. వీటిని ఉచితంగానే రైతులకు అందజేస్తామని చెప్పారు.
వివిధ రకాల భూములకు వేర్వేరు రంగులతో కూడిన పాస్‌బుక్‌లు అందజేయనున్నట్టుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. భూములకు ఆధార్, సర్వే నంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు చెప్పారు.