బిల్లుపై సంతకం చేసిన ట్రంప్.. ఇక వారికి కష్టమే..

‘వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ సంతకంతో బిల్లు అమల్లోకి వచ్చేసింది. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు.


తన కలల బిల్లుపై సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అమెరికా గెలుస్తోంది.. గెలుస్తోంది.. గెలుస్తోంది.. ముందెన్నడూ లేని విధంగా గెలుస్తోంది. దేశంలోని ప్రజలు ఇంత సంతోషంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, అన్ని రకాల ఉద్యోగాలకు రక్షణ కల్పిస్తున్నాము. మాట ఇచ్చాము.. నిలబెట్టుకున్నాము’ అని అన్నారు. కాగా, ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్లు’కు మంగళవారం సెనేట్‌లో ఆమోదం లభించింది. గురువారం ప్రతినిధుల సభలో దీనికి అనుకూలంగా 218 ఓట్లు వేశారు. మరో 214 మంది బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. మొత్తానికి బిల్లు అయితే పాస్ అయింది. శుక్రవారం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు.

బిల్లులో కీలక అంశాలు ఇవే..

  • ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించడం.
  • ఆహార సబ్సిడీల్లో కోత విధించటం.
  • గ్రీన్‌ ఎనర్జీకి ప్రోత్సాహకాలను రద్దు చేయటం.
  • వలసదారులను స్వదేశాలకు తిప్పిపంపేందుకు కఠిన చర్యలు తీసుకోవటం.
  • విద్యా రుణాల సాయాన్ని తగ్గించటం.
  • రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయించడం.
  • ఆరోగ్య రంగానికి సంబంధించిన సబ్సిడీల్లో కోత విధించటం.
  • కొత్తగా జన్మించిన పిల్లల పేరిట వెయ్యి డాలర్ల చొప్పున జమ చేయటం.
  • దిగుమతులపై మరిన్ని ఆంక్షలు విధించటం వంటి వాటితో పాటు చాలా అంశాలు 940 పేజీల ఆ బిల్లులో ఉన్నాయి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.