స్టీల్‌ డబ్బాల్లో వద్దు..

ప్లాస్టిక్‌ డబ్బాల వినియోగం ఆరోగ్యానికి హానికరం. అందుకే, ఆహార పదార్థాల నిల్వకోసం స్టీల్‌ పాత్రలనే ఎక్కువగా వాడుతున్నారు. కానీ, కొన్ని పదార్థాలు స్టీల్‌తో రసాయన చర్య జరుపుతాయని నిపుణులు చెబుతున్నారు.


అలాంటి వాటిని స్టీల్‌ పాత్రల్లో స్టోర్‌ చేయొద్దని సూచిస్తున్నారు. టమాటాల్లోని సహజ ఆమ్లాలు.. ఉక్కుతో చర్య జరుపుతాయి. దాంతో, ఆహార పదార్థాల రుచితోపాటు పోషకాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి, టమాటా వంటకాలను స్టీల్‌ డబ్బాల్లో నిల్వ చేయకపోవడమే మంచిది. సిరామిక్‌ బౌల్‌, గాజు కంటెయినర్లు వాడుకోవచ్చు. అసిడిక్‌ లక్షణాలు ఉండే పచ్చళ్లను కూడా స్టీల్‌ డబ్బాలకు దూరంగా ఉంచాలి. మామిడి, నిమ్మ, ఉసిరి, చింతపండులో ఉండే ఆమ్ల లక్షణాలు..

దీర్ఘకాలంలో స్టీల్‌తో రసాయన చర్య జరుపుతాయి. ఫలితంగా పచ్చళ్ల రుచి మారడంతోపాటు ఓ రకమైన మెటాలిక్‌ టేస్ట్‌ కూడా వస్తుంది. పచ్చళ్లు కూడా త్వరగా పాడవుతాయి. అందుకే, పచ్చళ్లకు స్టీల్‌ డబ్బాల కన్నా.. గాజు పాత్రలు, సిరామిక్‌ జాడీలే మంచివి. ఇక కట్‌ చేసిన పండ్లు, ఫ్రూట్‌ సలాడ్‌ వంటివి కూడా.. స్టీల్‌ గిన్నెల్లో పెట్టడం మంచిది కాదట. వాటిని ఎక్కువ సమయంపాటు స్టీల్‌ కంటెయినర్లలో ఉంచితే.. నీటిశాతం పెరుగుతుంది. రుచి కూడా దెబ్బతింటుంది.

బదులుగా.. గాజు పాత్రల్లో ఉంచితే ఫ్రెష్‌గా ఉంటాయి. సిట్రస్‌ జాతికి, స్టీల్‌కు పడనే పడదు. అందుకే, నిమ్మపండ్లతో చేసే లెమన్‌ రైస్‌, లెమన్‌ జ్యూస్‌ కూడా స్టీల్‌ డబ్బాల్లో స్టోర్‌ చేయొద్దు. మామిడికాయలు, చింతపండుతో తయారైన పదార్థాలను స్టీల్‌ డబ్బాలో నిల్వ చేసినా.. వాటి రుచి తగ్గుతుంది. ఇక పెరుగులోనూ సహజసిద్ధమైన ఆమ్ల లక్షణాలు ఉంటాయి. కాబట్టి, పెరుగును స్టీల్‌ డబ్బాల్లో ఎక్కువ సమయంపాటు పెడితే.. దాని రుచితోపాటు టెక్చర్‌ కూడా మారుతుంది. పెరుగును సిరామిక్‌, గాజు పాత్రల్లో నిల్వ చేయడమే ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.