అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 3 నెలల్లోనే ఫలించిన కల

పాల పంట కలల పంట, కుల్లాకర్‌ రైస్‌


సంతాన భాగ్యానికి, ఆరోగ్య భాగ్యానికి చిరునామాగా నిలుస్తోంది అరుదైన హెరిటేజ్‌ రైస్‌ ‘కుల్లాకర్‌’ (Kullakar Rice).

ఈ అపురూపమైన రెడ్‌ రైస్‌ పుట్టిల్లు తమిళనాడు అయినా దేశవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దేశీ వరి వంగడాల్లో పోషకాలు, విశిష్ట ఔషధ గుణాలు కలిగిన ఒకానొక అపురూప వంగడం ఇది.

గర్భ ధారణలో సమస్యలను అధిగమించాలన్నా.. లేకుండా సహజ రీతిలో సుఖప్రసవం కావాలన్నా.. ప్రసవానంతరం తల్లీ బిడ్డా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా.. అన్నిటికీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కుల్లాకర్‌ తదితర దేశీ వరి బియ్యాన్ని ఆశ్రయించాల్సిందేనా? దేశీ ఆవు పాలు, నెయ్యిని మెనూలో జోడించాల్సిందేనా?? అంటే.. ముమ్మాటికీ అవును అంటున్నారు ‘సేవ్‌’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్‌పికె) సాధకులు, దేశీ విత్తన పరిరక్షకులు ఎం. విజయ్‌రామ్‌.
ఆరోగ్యవంతమైన కుటుంబ జీవనానికి కుల్లాకర్‌ ఆరోగ్య బాటలు వేస్తోందని చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ముడి కుల్లాకర్‌ బియ్యాన్ని అనేక గ్రామాల్లో, హైదరాబాద్‌ నగరంలో గత కొన్నేళ్లుగా పలువురితో తినిపించారు. వారి అనుభవాల సారాన్ని ఆయన ఎలుగెత్తి చాటుతున్నారు. కేవలం కుల్లాకర్‌ బియ్యం తినటం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన సమృద్ధ జీవనానికి దోహదం చేసే ‘దేశీ ఆహారంతో కూడిన ఒక సమగ్ర జీవన విధానాన్ని ఆయన సూచిస్తున్నారు. ఇంతకీ దొడ్డు/ముతక రకం కుల్లాకర్‌ బియ్యం చుట్టూ అల్లుకున్న విశేషాలేమిటి? వాడిన/వాడుతున్న కుటుంబాల సుసంపన్న అనుభవాలేమిటి?? ఆలస్యం ఎందుకు.. !

మొదట సిజేరియన్‌.. రెండో కాన్పు నార్మల్‌!
అప్పుడు బెంగళూరులో ఉండేవాళ్లం. మొదట కాన్పులో బాబు పుట్టినప్పుడు సిజేరియన్‌ ఆపరేషన్‌ అయ్యింది. హైదరాబాద్‌ వచ్చిన రోజే రెండో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ అయ్యింది. సాధారణ వైట్‌రైస్‌ తినకుండా ఉండలేకపోయేదాన్ని. కేర్‌లెస్‌గా జంక్‌ఫుడ్‌ తినేదాన్ని. ప్రీడయాబెటిక్‌ స్టేజ్‌కి వెళ్లా. రెండో కాన్పు కూడా ఆపరేషన్‌ తప్పదనుకున్నాం. అయితే, గర్భం దాల్చిన నాలుగు నెలల తర్వాత, విజయరామ్‌ గారి వీడియోలు చూసి సుఖప్రసవానికి, ఆరోగ్యానికి కుల్లాకర్‌ బియ్యం ఉపయోగపడతాయని తెలుసుకున్నా. అప్పటి నంచి 4-5 నెలల పాటు కులాకర్‌ బియ్యాన్ని మట్టిపాత్రలో వండుకొని తినటం, దేశీ ఆవు నెయ్యి, పాలు వాడటం శ్రద్ధగా చేశా. నార్మల్‌ డెలివరీ అయ్యింది. బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. 21వ రోజే తల నిలిపాడు. స్థిమితంగా, నెమ్మదిగా ఉంటాడు. ఆకలైతేనో, నిద్ర వస్తేనో ఏడుస్తాడు.

మా ఇద్దరి పిల్లలకు ఈ విషయంలో తేడా గమనించాను. డెలివరీ తర్వాత బహురూపి, నారాయణ కామిని, ఇంద్రాణి వంటి దేశీ బియ్యం తింటున్నాం. నల్లబియ్యం, ఎర్రబియ్యం దోసెలకు వాడుతున్నాం. మా ఇంట్లో రెండు వైపులా పెద్దవాళ్లకు సుగర్‌ ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూర్చొని చేసే ఉద్యోగం, పైగా పని వత్తిడి. అయినా, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో పండించిన దేశీ ఆహారం తింటున్నాం కాబట్టి ఆ భయం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం.

ఆహారాన్ని ఇలా మార్చుకుంటే యూరిన్‌ ఇన్ఫెక్షన్, పిసిఓఎస్, పీరియడ్స్‌ సమస్యలు పోతాయి. మళ్లీ రావు. ఆలస్యం కాకముందే కళ్లు తెరిచి మీరేమి తింటున్నారో తెలుసుకోమని యువతకు స్వానుభవంతో ఘంటాపథంగా చెబుతున్నా. –రామవరపు సింధుకుమారి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, కొండాపూర్, హైదరాబాద్‌

3 నెలల్లోనే ఫలించిన కల
పెళ్లయిన ఐదేళ్లకు తొలి కాన్పులో బాబు అనారోగ్యంతో పుట్టి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 50 రోజులకు చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ గర్భం రాలేదు. ఆ దశలో కులాకర్‌ బియ్యం మధ్యాహ్నం, రాత్రి వండుకొని తినటం ప్రారంభించిన మూడు నెలల్లోనే, ఎటువంటి మందులు వాడకుండానే, నా భార్య సింధూరి గర్భం దాల్చింది. తర్వాత కూడా ఏ సమస్యలూ రాలేదు.

ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించింది. కులాకర్‌ బియ్యం గర్భం దాల్చటానికి దోహదపడుతున్నట్లు యూట్యూబ్‌లో విజయరామ్‌ వీడియో చూసి రెండేళ్ల క్రితం సేవ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి కలిశాం. అప్పటి నుంచి కుల్లాకర్, బహురూపి, గోవింద భోగ్, నవార బియ్యం, దేశీ ఆవు నెయ్యి పాలు ఉపయోగిస్తున్నందు వల్లనే మా కల నెరవేరింది. ఇంట్లో అందరికీ ఆరోగ్యం చేకూరిందని నూరు శాతం నమ్ముతున్నాం. ఇవన్నీ తింటుంటే ఎగతాళి చేసిన మా అక్క ఇప్పుడు రసాయనాల్లేని దేశీ బియ్యం, దేశీ ఆవు ఉత్పత్తుల ప్రభావాన్ని గుర్తించింది. మా అత్తగారి (కడప జిల్లా వేంపల్లె) ఊళ్లో 3 ఎకరాల భూమి కొన్నా. నాకు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించబోతున్నాం. – సి. క్రాంతికుమార్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, హైదరాబాద్‌

20 మంది కలలు పండాయి!
వికారాబాద్‌ జిల్లా దారూర్‌ మండలం నాగసముందర్‌ గ్రామంలో సంతానం కావాలనుకునే 30 మంది మహిళలకు 18 నెలల పాటు కుల్లాకర్‌ బియ్యాన్ని ఇచ్చి వాడించాం. అదే విధంగా, కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరు లంక గ్రామంలో 18 నెలల పాటు 20 మందికి ఈ బియ్యాన్ని తినిపించాం. వీళ్లందరూ గర్భదాల్చారు. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టారు.

పిల్లల బరువు 2.5 కేజీల నుంచి 3 కేజీల మధ్యన వుంది. పుట్టిన పిల్లలు చలాకీగా వున్నారు. వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా వుంది. ఒక సంవత్సరం లోపు పిల్లలు ఇతరుల దగ్గర వున్నప్పుడు చికాకుతో ఏడవట్లేదు. పాలు అవసరమైనప్పుడు మాత్రమే తల్లి కోసం ఏడుస్తున్నారు. మధ్యలో తల్లి కనిపిస్తూ వుంటే ఇతరులతో స్థిమితంగా వుండ గలుగుతున్నారు. తల్లుల ఆరోగ్యం బాగుంది. పిల్లలకు సరిపడా పాలు వున్నాయి.

ఈ పద్ధతిని పాటించిన ఒక ప్రవాస భారతీయురాలు కుల్లాకర్‌ బియ్యాన్ని వాడి బిడ్డకు సరిపడా పాలు ఇవ్వడమే కాకుండా తల్లి పాల బ్యాంకుకు తన పాలను దానం చేయగలిగింది. చాలా మంది గర్భవతులకు సహజ సిద్ధంగా సులభ ప్రసవం జరిగింది.
9 సంవత్సరాల నుంచి పిల్లలు లేని తల్లి ఈ బియ్యాన్ని వాడి 40 రోజుల్లోనే గర్భవతి అయ్యింది. అంతకు మునుపు అబార్షనై, పిసిఓడితో బాధపడే ఒకామె ఈ బియ్యాన్ని 6 నెలలు వాడి పండంటి బిడ్డను కన్నారు. ప్రైవసీ కోసం వారందరి పేర్లు బహిరంగంగా ఇవ్వలేకపోతున్నాం. ఆసక్తి గల ఎవరైనా హైదరాబాద్‌ లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్డులోని ‘సేవ్‌’ ఆఫీసు(సుంకర వెంకట రమణ: 63091 11427) ను సంప్రదించి, వారితో ఫోనులో మాట్లాడొచ్చు. తర్వాత నేరుగా కలవొచ్చు కూడా!
– ఎం. విజయ్‌ రామ్, దేశీ విత్తన పరిరక్షకులు, సుభాష్‌ పాలేకర్‌ కృషి (ఎస్‌పికె) సేద్య విధాన సాధకులు, సేవ్‌ సంస్థ వ్యవస్థాపకులు

కుల్లాకర్‌లో పోషకాలేమిటి?
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే దేశీ వరి బియ్యంలో అద్భుతమైన పోషక / ఔషధ విలువలు చెక్కు చెదరలేదన్న విషయం మనకు బోధపడుతుంది. అపారమైన దేశీ వరి జీవవైవిధ్యం చాలా వరకు కాలగర్భంలో కలసిపోయింది. అయితే, కొద్ది మంది ముందుచూపున్న రైతులు ఇప్పటికీ అనేక వందల అలనాటి వరి వంగడాలను ఏటేటా సాగు చేస్తూనే ఉన్నారు. వీటిని అపురూపంగా పరిరక్షించుకుంటున్నారు. ఇంతకీ, ఏ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఏయే దేశీ వరి బియ్యం ఉపయోగపడతాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు! అందుకే ఈ ఆహారమే ‘దివ్యౌషధం’ అయ్యింది!! చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ నాలెడ్స్‌ సిస్టమ్స్‌ (సిఐకెస్‌) అనే స్వచ్ఛంద సంస్థ ‘ట్రెడిషినల్‌ రైస్‌ వెరైటీస్‌ ఆఫ్‌ తమిళనాడు: ఏ సోర్స్‌ బుక్‌’ అనే సంకలనాన్ని 2019లో ప్రచురించింది. దీని ప్రకారం.. సేంద్రియంగా పండించిన కుల్లాకర్‌ బాయిల్డ్‌ (ఉప్పుడు) బియ్యంలో వివిధపోషకాలు మెండుగా ఉన్నాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జిఐ) తక్కువ. ఐరన్, కాల్షియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.