నాన్ వెజ్ లో 99శాతం మంది మెచ్చేది చికెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చికెన్ తో రకరకాల వెరైటీ వంటకాలు తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా ఎండుమిర్చి కోడి వేపుడు తిన్నారా? ఎండుమిర్చి కోడి వేపుడు పేరు వినగానే కారంగా, రుచికరంగా ఉంటుందని అర్థమవుతుంది. ఇది దక్షిణ భారత దేశంలోముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధమైన వంటకం. వేడిగా ఉండే అన్నం, పప్పుచారు లేదా సాంబారుతో కలిపి తినడానికి చాలా బాగుంటుంది. దీనిని స్నాక్ గా లేదా స్టార్టర్‌గా కూడా వడ్డించవచ్చు. ఈ రెసిపిలో ఎండుమిర్చి ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఇది వంటకానికి ఒక ప్రత్యేకమైన కారం, సువాసనను ఇస్తుంది. మీ ఇంట్లోనే చాలా ఈజీగా మిరపకాయ కోడి వేపుడు ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
మిరపకాయ కోడి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-ఉప్పు
-చికెన్
-పసుపు
-కరివేపాకు
-జీలకర్ర పొడి
-జీడిపప్పు
-గరం మసాలా
-ధనియాల పొడి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఉల్లిపాయ
-టమాటో
-ఆయిల్
-నెయ్యి
మిరపకాయ కోడి వేపుడు తయారీ విధానం
-మిరపకాయ కోడి వేపుడు ఎప్పుడైనా తిన్నారా?..స్పైసీగా భలే రుచిగా ఉంటుంది..ఎలా చేసుకోవాలంటే..
-ముందుగా 12 ఎండుమిరపకాయలను నీటిలో వేసి 1 గంటసేపు నానబెట్టాలి.
-ఎండుమిరపకాయలను మిక్సీ జార్ లో వేసి నానబెట్టిన నీళ్లనే కొంచెం పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అరకేజీ చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద లోతైన వెడల్పాటి బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక ఇందులో కడిగిన చికెన్ ముక్కలు వేసి,కొద్దిగా ఉప్పు,కొద్దిగా పసుపు వేసి పెద్ద మంట మీద 2 నిమిషాలు కలుపుతూ వేయించాలి.
-తర్వాత మూతపెట్టి మంటను మీడియంలో ఉంచి ఉడికించాలి.చికెన్ లో నుంచి ఊరిన నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అప్పుడప్పుడూ కలుపుతూ ఉడికించుకోవాలి.
-ఇప్పుడు అందులో 2 ఉల్లిపాయల చిన్న ముక్కలు వేసి మీడియం మంటమీదనే 2 నిమిషాలు వేయించాలి.
-తర్వాత అందులో 2 టీస్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఎండుమిర్చి పేస్ట్ ఆయిల్ లో బాగా వేగితేనే పచ్చివాసన పోయి టేస్ట్ బాగుంటుంది.
-ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో 1 టమాటో చిన్న ముక్కలు వేసి వి మెత్తబడేదాకా వేయించాలి.
-తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, గుప్పుడు కరివేపాకు, కొన్ని జీడిపప్పు వేసి తక్కువ మంట మీద 3 నిమిషాలు వేయించాలి. తర్వాత 1 టీస్పూన్ నెయ్యి అందులో వేసి 1 నిమిషం వేయించాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి వేసి, అర టీస్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ మిరపకాయ కోడి వేపుడు రెడీ.
































