ఇడ్లీ, దోశ పిండి లేదా? – వెంటనే చేసుకునే సూపర్ బ్రేక్​ఫాస్ట్! – పిల్లలూ ఇష్టంగా తింటారు

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్​గా రుచికరమైన రెసిపీలు ప్రిపేర్ చేసుకోవడానికి తగినంత టైమ్ ఉండకపోవచ్చు. అలాగే, కొన్నిసార్లు ఇంట్లో సమయానికి ఇడ్లీ, దోశ పిండి వంటివి అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇన్​స్టంట్​గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ రెసిపీ ఉంది. అదే, కమ్మగా నోరూరించే “ఉగ్గాని”. కర్నూలు స్టైల్​లో మరమరాలతో అప్పటికప్పుడు చేసుకునే ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది బ్రేక్​ఫాస్ట్​లోకి మాత్రమే కాకుండా ఈవెనింగ్ స్నాక్​గానూ మంచి ఆప్షన్​ అని చెప్పుకోవచ్చు. కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లో చేసుకునే దీన్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన ఇంగ్రీడియంట్స్ :

  • మరమరాలు(బొరుగులు) – 2 నుంచి 3 కప్పులు
  • పుట్నాలు – పావు కప్పులో సగం
  • ఎండుమిర్చి – రెండు
  • కరివేపాకు – కొద్దిగా
  • పచ్చిమిర్చి – ఒకట్రెండు
  • అల్లం – చిన్న ముక్క
  • నూనె – ఒకట్రెండు టేబుల్​స్పూన్లు(తగినంత)
  • ఆవాలు – పావుటీస్పూన్
  • జీలకర్ర – పావుటీస్పూన్
  • సన్నని ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
  • టమాటాలు – రెండు(చిన్నవి)
  • పసుపు – కొద్దిగా
  • ఉప్పు, కారం – టేస్ట్​కి సరిపడా
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • తయారీ విధానం :

    • రాయలసీమ స్టైల్​లో సూపర్ టేస్టీగా ఉండే ఉగ్గాని తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో మరమరాలను తీసుకోవాలి. ఆపై అందులో అవి మునిగే వరకు వాటర్ పోసుకొని రెండు మూడు నిమిషాలు నానబెట్టాలి.
    • మరమరాలు చక్కగా నానిన తర్వాత వాటిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ అదనపు వాటర్ పిండేస్తూ ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
    • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, ఎండుమిర్చి వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కనుంచాలి.
    • తర్వాత అదే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా ​గ్రైండ్ చేసుకోవాలి.
    • అనంతరం స్టవ్ మీద పాన్​లో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
    • అవి వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని ఒకట్రెండు నిమిషాలు ఆనియన్స్ దోర దోరగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి.
    • ఆ తర్వాత టమాటా ముక్కలు, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ టమాటాలు కాస్త సాఫ్ట్​గా మారేంత వరకు మగ్గించాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని సన్నని సెగ మీద ఒకనిమిషం పాటు అవన్నీ కలిసేలా వేయించాలి.
  • ఆపై అందులో నానబెట్టి ప్లేట్​లోకి తీసుకున్న మరమరాలు, గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని రెండు టేబుల్​స్పూన్ల వరకు వేసుకొని మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోవాలి.
  • తర్వాత లో ఫ్లేమ్​లో మరమరాలు కాస్త వేడి అయ్యేంత వరకు కలుపుతూ మూడ్నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక చివర్లో కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, రాయలసీమ స్టైల్​లో వేడి వేడిగా కమ్మని “ఉగ్గాని” రెడీ అయిపోతుంది!
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.