భూకంపాలు, వరదలు, సునామీ, కార్చిచ్చు, కరవు లాంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రస్తుతం ప్రపంచాన్ని అలుముకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ కారణంగా ఈ విపత్తులు సంభవిస్తున్నాయి.
తాజాగా రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్ కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అటు అమెరికాలోని హవాయి రాష్ట్రానికి కూడా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలను వదిలి తరలి వెళ్లుతున్నారు.
అయితే ఇప్పుడు ఓ దేశం మాత్రం ఏకంగా సముద్రంలో మునిగిపోనుంది. మరికొన్ని రోజుల్లో ఆ దేశం కనుమరుగు కానుంది. పసిఫిక్ సముద్రంలోని ఆ ద్వీప దేశం గ్లోబల్ వార్మింగ్ కు బలి అవుతున్న తొలి దేశంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాల్లో అదీ ఒకటి. ఆ దేశం పేరు తువాలు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న దీవి. ఈ దేశ జనాభా సుమారు 11,200గా ఉంది. తువాలు దేశ విస్తీర్ణం 10 చదరపు మైళ్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక్కడి ప్రజల్లో చాలా మంది చేపల వేట, కొబ్బరి ఉత్పత్తులపై ప్రధానంగా ఆధారపడి జీవిస్తుంటారు.. తువాలు ఐలాండ్ చుట్టూ సముద్రాలే ఉన్నాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఇటీవల వాతావరణంపై పడిన నేపథ్యంలో తువాలు దీవి చుట్టూ సముద్ర మట్టాలు పెరగడం ప్రారంభమైంది. ఐలాండ్ కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడం మొదలైంది. దీంతో ఈ ద్వీప దేశానికి పెను ప్రమాదమే వచ్చి పడింది. మరికొన్ని సంవత్సరాల్లో తువాలు ద్వీపం పూర్తిగా కనుమరుగు కానుంది.
అయితే ఓ వైపు ప్రకృతి సవాళ్లను ఎదుర్కుంటూనే.. తువాలు దేశం తన ఆర్థిక సాంకేతిక అభివృద్ధిపై దృష్టి సారించింది. రాజధాని ఫునాఫుటిలో ఇటీవల తొలి ఏటీఎంను స్థాపించారు. స్థానిక బ్యాంక్ సేవలను ఆధునీకరించారు. మరోవైపు తువాలు ఐలాండ్ ను నూరుశాతం డిజిటల్ నేషన్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ తరాలకు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పాలకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆ దేశ పౌరులు మాత్రం దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో క్లైమేట్ వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ వీసా ద్వారా శాశ్వతంగా ఆస్ట్రేలియాకు వలస వెళ్లేందుకు ప్రజలు సన్నద్ధం అవుతున్నారు.



































