కమ్మని “సగ్గుబియ్యం – రాగి పాయసం” – ఇలా చేస్తే పాలు విరగవు, చల్లారినా గట్టిపడదు

 ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువ మంది రాగులను తమ డైలీ డైట్​లో భాగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోషకాలు పుష్కలంగా ఉండే రాగులతో చాలా మంది మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో జావ, ఇడ్లీ, దోశ, సంగటి, పొంగనాలు ఇలా రకరకాల వంటకాలు చేసుకొని ఆరగిస్తున్నారు. అయితే, ఆరోగ్యానికి మేలు చేసే ఈ చిరుధాన్యాలతో కేవలం టిఫెన్స్​ మాత్రమే కాకుండా సగ్గుబియ్యంతో కలిపి ఇలా కమ్మని “పాయసం” ప్రిపేర్ చేసుకోండి. ఇంటిల్లిపాదీ సరికొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు. పైగా శ్రావణ మాసం నడుస్తుండడంతో ఈ పద్ధతిలో సింపుల్​గా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగానూ నివేదించవచ్చు. పిల్లలైతే గ్లాసులో ఈ పాయసాన్ని పోసిచ్చారంటే చుక్క మిగల్చకుండా తాగేస్తారు. అంతేకాదు, ఈ స్వీట్ పాలు విరగకుండా, చల్లారినా గట్టి పడకుండా ఉంటుంది! మరి, రాగి పిండితో ఈ రుచికరమైన సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

  • సగ్గుబియ్యం – అర కప్పు
  • రాగి పిండి – అర కప్పు
  • నెయ్యి – రెండు టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్​స్పూన్
  • బాదం పలుకులు – రెండు టేబుల్​స్పూన్లు
  • సన్నని ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్​స్పూన్
  • కిస్​మిస్​లు – రెండు టేబుల్​స్పూన్లు
  • బెల్లం తురుము – రెండు కప్పులు
  • యాలకుల పొడి – ఒక చెంచా
  • కాచి చల్లార్చిన పాలు – రెండు కప్పులు
  • తయారీ విధానం :

    • ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ పాయసం ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక కప్పు వరకు నీళ్లు పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి.
    • ఇప్పుడు స్టవ్ మీద పాయసం తయారీ కోసం అందుకు అనుగుణంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఆరు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి.
    • తర్వాత అందులో అరగంటపాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్​తో సహా వేసుకొని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్​లో ఆ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి.
    • సగ్గుబియ్యం ఉడికేలోపు స్టవ్ మరో బర్నర్ మీద ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
    • అవి సగం వరకు వేగాక కిస్​మిస్​లను జత చేసి అన్నింటినీ ఎర్రగా వేయించి ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
    • అనంతరం మిగిలిన నెయ్యిలో రాగి పిండిని వేసుకొని లో ఫ్లేమ్​లో రెండు నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక చిన్నపాటి మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
    • తర్వాత అందులో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం మంచిగా ఉడికాయనుకున్నాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని మరోసారి కలిపి ఆ మిశ్రమంలో పోసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి ఐదారు నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి.
  • రాగిపిండి మిశ్రమం బాగా ఉడికి చిక్కగా మారి బబుల్స్ వస్తున్నప్పుడు బెల్లం తురుముని యాడ్ చేసి కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగేలా మరో మూడ్నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
  • అలా ఉడికించినప్పుడు ఆ మిశ్రమం మరికాస్త చిక్కగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని బాగా కలిపి పాన్​ని దింపి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
  • ఆ మిశ్రమం కొద్దిగా వేడి తగ్గిన తర్వాత అందులో కాచి చల్లారిన పాలను పోసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి.
  • ఆపై ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, యమ్మీ యమ్మీగా నోరూరించే “సగ్గుబియ్యం రాగిపిండి పాయసం” రెడీ అయిపోతుంది!

చిట్కాలు :

  • ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్న కప్పునే బెల్లం తురుము, వాటర్, మిగతా ఇంగ్రీడియంట్స్ కొలవడానికి వాడుకోవాలి.
  • ఒకవేళ మీరు స్వీట్ కాస్త తక్కువ తినేవారు అయితే బెల్లాన్ని ఒకటిన్నర కప్పుల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
  • రాగి పిండి మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేసుకోవద్దు. అలా చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే, కాస్త చల్లారిన తర్వాత మాత్రమే పాలు పోసి కలుపుకోవాలి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.