టెంపుల్ స్టైల్‌లో అమృతం లాంటి దద్దోజనం.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో దద్దోజనానికి విశిష్ట స్థానం ఉంది. దీనిని ఎక్కువగా పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు దేవుడికి నైవేద్యంగా సమర్పించే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దద్దోజనం (పెరుగన్నం) ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.


టెంపుల్ స్టైల్‌లో కమ్మటి పెరుగన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

అన్నం: వండుకున్నది

పెరుగు: సరిపడా

పచ్చిమిర్చి: చిన్న ముక్కలుగా తరిగినవి

కరివేపాకు రెమ్మలు: కొన్ని

అల్లం: చిన్న ముక్క (సన్నగా తరిగినది)

ఆవాలు: తాలింపు కోసం

జీలకర్ర: తాలింపు కోసం

పచ్చి శనగ పప్పు: తాలింపు కోసం

మినపపప్పు: తాలింపు కోసం

కొత్తిమీర: చిన్న కట్ట (తురుము)

నెయ్యి లేదా ఆయిల్: తాలింపు కోసం

ఎండు మిర్చి: తాలింపు కోసం

ఉప్పు: రుచికి సరిపడా

ఇంగువ: చిటికెడు

తయారుచేసే విధానం:
అన్నం సిద్ధం చేయడం:
ముందుగా వండుకున్న అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలి. పెరుగన్నానికి అన్నం ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తుంది. మనం రోజువారీగా ఉపయోగించే సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యం అయితే పెరుగన్నం చాలా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మెత్తగా కలిపిన అన్నంలో రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు పక్కన పెట్టాలి.

తాలింపు సిద్ధం చేయడం:
ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగ పప్పు, మినపపప్పు కొద్దిగా వేసి వేగనివ్వాలి.
అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి, పోపు దినుసులు మాడకుండా సన్నని మంటపై వేయించాలి.

చివరి మెరుగులు:
పోపు కొద్దిగా వేగాక, అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాస్త చిటపటలాడించి, ఇంకొక చిటికెడు ఇంగువ వేయాలి. ఇంగువ కూడా కాస్త వేగాక, పోపు పెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతటిని సరాసరి మనం పెరుగు వేసి కలిపిన అన్నంలో వేసుకోవాలి.
ఇప్పుడు పోపును అన్నంలో బాగా కలుపుకొని, చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర తురుము చల్లితే సరిపోతుంది.

చిట్కా: ఈ పెరుగన్నం తయారీలో కొందరు దానిమ్మ గింజలు, ద్రాక్షపళ్లు, సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వంటివి కూడా వేస్తుంటారు. మీకు కావాలంటే వాటిని కూడా యాడ్ చేయొచ్చు.

అంతే, ఎంతో కమ్మటి అమృతం లాంటి పెరుగన్నం (దద్దోజనం) రెడీ! ఏమి తినబుద్ధి అవ్వనపుడు, కడుపులో నలతగా ఉన్నప్పుడు, లేదా ప్రసాదానికి… ఇలా అన్ని రకాలుగా ఈ పెరుగన్నం వాడుకోవచ్చు. మీరు కూడా కమ్మని పెరుగన్నం చేసుకోవాలని భావిస్తే, ఈ సులువైన విధానాన్ని అనుసరించండి. సింపుల్‌గా టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.