దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం భారీ ఉపశమనం కల్పించింది. ముఖ్యంగా డయాబెటిస్ , గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, దీర్ఘకాలిక నొప్పులు వంటి జబ్బులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ- NPPA నోటిఫికేషన్ విడుదల చేసింది.
35 ఔషధాల రిటైల్ ధరల తగ్గింపు
దేశవ్యాప్తంగా 35 రకాల మందుల ధరలను తగ్గించి, ఆ మందులను సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసింది. దేశ ప్రజలకు మందులను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) తాజాగా కొన్ని మందుల పైన ధరలను తగ్గించింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలు విక్రయిస్తున్న 35 ఔషధాల రిటైల్ ధరలను తగ్గించింది.
ఈ ఔషధాలపైనే తగ్గింపు
ఒంటి నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక వ్యాధులు, మధుమేహం వంటి వాటి చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై ఈ తగ్గింపు వర్తించనుంది. ఎసిలోఫెనాక్, పారాసెటమాల్, ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్, అమోక్సిసిలిన్-పొటాషియం క్లావ్యులానేట్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ వంటి మందుల ధరలను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలన్న ఎన్పీపీఏ
అంతేకాదు మెడికల్ షాప్ లో రిటైలర్లు, డీలర్లు తాజా ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని కూడా ఎన్పీపీఏ ఆదేశించింది. ఇక తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫార్మసీ కంపెనీలు కొత్త ధరల జాబితాను ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అప్డేట్ చెయ్యవలసి ఉంది. ఈ కొత్త ధరల జాబితా ఎన్పీపీ ఏ కి, రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్ కు సమర్పించాలని ఆదేశించింది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం
ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఎంతోమందికి కాస్త ఉపశమనం దొరకనుంది. మందులు కొనుగోలు చెయ్యాలంటే ఎక్కువ ధరలు ఉన్నాయని ఇబ్బంది పడేవారు ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా మందులు కొనుగోలు చేసుకోవచ్చు.
































