ప్రస్తుతం బాలీవుడ్ టూ టాలీవుడ్ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా నటీనటుల పెళ్లి వార్తలు, విడాకులు, ప్రెగ్నెన్సీ వార్తలే కనిపిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు తమ బ్యాచిలర్ లైఫ్‌కి ఎండ్ కార్డ్ వేసి..
వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎప్పటికప్పుడు ఆయన పెళ్లిపై ఊహాగానాలు రావడం తర్వాత గాలివార్తలుగా మిగిలిపోవడం జరుగుతోంది.
పాన్ ఇండియా స్టార్‌గా హవా
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రభాస్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఏ హీరోకి లేని మార్కెట్, ఫాలోయింగ్ ప్రభాస్ సొంతం. ఆయన పేరు మీద వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. గతేడాది కల్కి 2898 ఏడీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ప్రభాస్. కొద్దిరోజుల క్రితం కన్నప్పలో రుద్రగా ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
ప్రభాస్ – అనుష్కల మధ్య ప్రేమాయణం?
కెరీర్ పరంగా తిరుగులేని స్థానంలో నిలిచిన ప్రభాస్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. 50కి చేరువ అవుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పలువురు హీరోయిన్లతోనూ ప్రభాస్‌కి లింక్ పెట్టి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్‌కి సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పెళ్లి చేసేశారు. తాము మంచి మిత్రులం మాత్రమేనని, తమ మధ్య ఏం లేదని ప్రభాస్ – అనుష్కలు ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు. అనుష్క కూడా 50కి దగ్గరవుతున్నా పెళ్లి చేసుకోకుండా, ఒంటరిగా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. అనుష్కతోనే కాకుండా ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన నటించిన కృతిసనన్, పాయల్ రాజ్‌పుత్ తదితరులతోనూ ప్రభాస్‌కి లింక్ పెట్టేశారు పుకారు రాయుళ్లు.
ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ హింట్
మొన్నామధ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఖాయమైందని రేపో మాపో పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి సీక్రెట్‌గా చూసుకుంటున్నారని పుకార్లు వినిపించాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కూడా డార్లింగ్ పెళ్లిపై హింట్ ఇవ్వడంతో అభిమానులు సంబరపడిపోయారు. తర్వాత ఇది కూడా ఒట్టిదేనని తేలింది.
అంతా ఆయన చేతుల్లోనే
తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయంలో శ్యామలా దేవి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో ప్రతినిధులు ఆమెను ప్రభాస్ పెళ్లిపై ఆరా తీయగా శ్యామలా దేవి స్పందించారు. అందరూ ప్రభాస్ పెళ్లి ఎప్పుడని వెయిట్ చేస్తున్నారు. . మా పరిస్ధితి కూడా అదేనని శ్యామలా దేవి అన్నారు. బాబుకు పెళ్లి చేయాలని మనస్పూర్తిగా అనుకొంటున్నాం. ఈ ఏడాదే చేస్తామా? అంటే.. అది చెప్పలేమని ఆమె తెలిపారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కాదా.. ఆయన అనుగ్రహం లేకుండా ప్రభాస్ పెళ్లి జరగదని తేల్చేశారు శ్యామలాదేవి. శివుడు ఎప్పుడూ అనుగ్రహిస్తే అప్పుడే పెళ్లి జరుగుతుంది అని ప్రభాస్ పెద్దమ్మ తెలిపారు. బయట అమ్మాయా? లేక సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయా అనేది తెలియదని.. కానీ పెళ్లి మాత్రం తప్పకుండా జరుగుతుందని శ్యామలాదేవి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































