పెసరపప్పు – ఎర్రపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..? తప్పక తెలుసుకోండి.

భారతీయ వంటకాల్లో పప్పు ధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పోషకాలతో నిండి ఉండటమే కాకుండా రుచిలో కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే వీటిలో ముఖ్యంగా పెసరపప్పు, ఎర్రపప్పులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.


రెండింటిలోనూ ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, కండరాలను బలోపేతం చేయడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెసరు పప్పులో ఏముంటుంది?

పెసరపప్పులో ప్రొటీన్, ఫైబర్, కొవ్వు, విటమిన్లు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీని ప్రధాన లక్షణం సులభంగా జీర్ణమవడం. అందుకే ఇది కడుపు సమస్యలను తగ్గించి, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఇది బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడుతుంది.

ఎర్ర పప్పు పోషకాల నిధి..

మసూర్ పప్పులో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎముకలను బలోపేతం చేయడంలో, బరువు తగ్గించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది తోడ్పడుతుంది.

ఏది ఎక్కువ మంచిది?

పెసర పప్పు, ఎర్రపప్పు రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలని చూస్తున్న వారికి ఎర్ర పప్పు మంచి ఎంపిక. ఇది శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది. అదే సమయంలో పెసరుపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది. కాబట్టి మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం ఈ రెండు పప్పులను మీ ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.