కొర్రమీను రుచిలోనే కాదు, ఆరోగ్యానికీ మేలు చేస్తుందట! – ఎందుకో తెలుసా? –

Murrel Fish Health Benefits: ‘ఆహా ఇలస, ఓహో పులస’ అంటూ దాని కోసం చాలామంది ఎదురుచూసినా అది దొరికేది కేవలం వర్షా కాలంలోనే! పైగా అందనంత ధర. కానీ, ఏడాది పొడవునా అందుబాటులో ఉండే రుచికరమైన, ఆరోగ్యకరమైన చేపల్లో ముందుగా గుర్తొచ్చేది మాత్రం కొర్రమీను. ఖరీదు కిలో రూ.300 నుంచి 700 వరకు ఉంటుంది. దీన్నే బొమ్మె చేప అనీ అంటారు. శాస్త్రీయనామం చన్నా స్ట్రియాటస్. ఇది మంచి నీటి ఔషధ చేప. ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్న నీటిలోనూ పెరిగే సామర్థ్యం దీని సొంతం. చెరువులు, నదులతో పాటు వరి పొలాల్లోనూ పెంచుతారు. ఈ క్రమంలో కొర్రమీను వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!


ముళ్లు తక్కువగా ఉండే కొర్రమీను నీటిలోనే కాదు, తడి నేలమీదా మూడు లేదా నాలుగు రోజులు జీవించగలదని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొర్రమీను బతికున్న దశలోనే ఎక్కువగా మార్కెట్లో దొరుకుతుందని, ఇందులో జెయిండ్, స్ట్రైప్​డ్, స్పాటెడ్, మడ్ ఇలా నాలుగు రకాల ప్రధాన రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల పాముని పోలి ఉంటుంది కాబట్టి, స్నేక్ హెడ్ ఫిష్ అనీ అంటారు. పులుసు, వేపుడు ఎలా చేసుకున్నా రుచిగా ఉంటుందని వివరించారు.

వాళ్లకీ మంచి పోషకాహారం : పొట్టకు సంబంధించిన సమస్యలకు ఈ చేప మంచి ఔషధమంటున్నారు నిపుణులు. మలబద్ధకం ఉన్న వాళ్లు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుందని, ఇందులోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు మంటని, వాపుని తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే కీళ్లనొప్పులు, ఆస్తమాతో బాధపడే వాళ్లకీ కూడా మంచి పోషకాహారమని పేర్కొన్నారు. ఈ చేపలు తీసుకునే వారికి నొప్పి, చికాకు నుంచి ఉపశమనం లభించే ప్రయోజనాల్లో ఒకటని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

కొర్రమీనులో కీలకమైన అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాల సమ్మేళనం కండరాల పెరుగుదలకీ, గాయాల నివారణకీ తోడ్పడుతుంది. ముఖ్యంగా గ్లైసిన్, అరాకిడోనిక్ ఆమ్లాలు గాయాలను మాన్పడానికి సాయపడతాయి. గ్లైసిన్ అనే అమైనో ఆమ్లం కొల్లాజెన్​లో కీలకమైంది. చర్మ నిర్మాణం, పుండ్లు, గాయాలు మానడానికి తోడ్పడుతుంది. అలాగే అరాకిడోనిక్ అనే ఫ్యాటీ ఆమ్లం కూడా గాయాల్ని నయం చేయడానికి సాయపడుతుంది. అందుకే ఈ రెండు ఆమ్లాలూ ఫుష్కలంగా ఉన్న ఈ చేప సిజేరియన్, ఇతరత్రా సర్జీలు చేయించుకున్నవాళ్లకీ మంచిది. అయితే, మంచినీటి చేప కాబట్టి సముద్ర చేపలతో పోలిస్తే మెర్క్యురీ కాలుష్యం బారినపడే ప్రమాదం తక్కువే అయినప్పటికీ గర్భిణులు తగు మోతాదులో తీసుకోవడం మేలు

యాంటీడిప్రసెంట్​గా : కొర్రమీను చర్మంలోని ఓ పదార్థం సెరెటోనెర్జిక్ అనే గ్రాహక వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా యాంటీడిప్రసెంట్​గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గాయాలను నయం చేయగల అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు ఇందులో ఉన్నాయని, ఇది యాంటీనోసైసెప్టివ్ ప్రభావాన్ని కలిగి ఉందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

ప్రొటీన్ ఎక్కువగా : ఈ చేపలో కొవ్వు తక్కువగా ఉంటుందని, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ అధికంగా ఉంటాయని చెబుతున్నారు. వంద గ్రాముల కొర్రమీనులో 25.2 గ్రా ప్రొటీన్ ఉంటుందని, అదే చికెన్​లో 18.2 గ్రా., గుడ్డులో 12.8 గ్రా ఉంటుందని వివరించారు. అందుకే హృద్రోగులు, బీపీ, షుగర్ రోగులకు ఈ చేప మేలుచేస్తుందని తెలుపుతున్నారు. ఇందులో కేవలం ప్రొటీన్​ మాత్రమే కాకుండా ఎ, డి3, బి12, సి విటమిన్లతో పాటు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం వంటి ఖనిజాలూ ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ మెదడు పనితీరు, చర్మ సంరక్షణ, జుట్టు పెరుగుదలకి తోడ్పడతాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.