ఏపీలో ఇక ఫ్యామిలీ కార్డు..! చంద్రబాబు కీలక నిర్ణయం

పీలో భారీ ఎత్తున పథకాల పందేరం జరుగుతున్నా వాటి ప్రయోజనాలు మాత్రం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలపై ఎన్నికల్లో అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో పథకాల లబ్దిదారులకు కలుగుతున్న ప్రయోజనాన్ని వారికి సమగ్రంగా తెలిసేలా చేయడంతో పాటు ఇతర వివరాలతో ఆధార్ తరహాలో ప్రతీ కుటుంబానికీ ఓ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇవాళ నిర్ణయించారు.


ఫ్యామిలీ బెన్ఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇందులో సంక్షేమ పథకాల లబ్దిదారులకు త్వరలో ఫ్యామిలీ కార్డ్ జారీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీంలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం పొందుపరచనుంది.

రాష్ట్రంలో త్వరలోనే పాపులేషన్ (జనాభా) పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఏయే కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్దం చేయాలని సీఎం సూచించారు. ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీంల వివరాలను పొందుపరచాలని ఆదేశించారు.

ఆధార్ తరహాలో లబ్దిదారులు ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకునేలా ఉండాలన్నారు. కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకు రావాలని, ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని చంద్రబాబు తెలిపారు. అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే స్కీంలను రీ-డిజైన్ చేసే అంశాన్నీ పరిశీలిద్దామని అధికారులకు సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.