ఆగస్టు 2025లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వే ప్రకారం, దేశంలోని ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు.
అస్సాంలో 44.6 శాతం మంది ప్రతివాదులు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో, 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ ర్యాంకింగ్స్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇద్దరూ 41.9 శాతంతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 40.7 శాతంతో నాలుగో స్థానంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 40.4 శాతంతో ఐదో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆరో స్థానం దక్కించుకోగా, ఏపీ సీఎం చంద్రబాబు 7వ స్థానంలో నిలిచారు. గతంలో ఆయన ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 9 స్థానంలో నిలవగా, పంజాబ్ ముఖ్యమంత్రి 10 స్థానాన్ని దక్కించుకున్నారు.
ఇక హిమంత బిస్వా శర్మ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఫిబ్రవరి 2025లో 55 శాతంగా ఉన్న ఆయన సంతృప్తి రేటింగ్ ఆగస్టు నాటికి 44.6 శాతానికి పడిపోవడం గమనార్హం. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ తగ్గుదల ఓటర్లలో పాలన పట్ల కొంత అసంతృప్తిని సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తన రేటింగ్ పడిపోయినప్పటికీ, ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే ఆయన ప్రజాభిప్రాయంపై పట్టు ఇంకా బలంగానే ఉంది. ఇండియా టుడే యొక్క ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పోల్ 2001లో ప్రారంభమై, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తోంది.
































