భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు కిచిడీని అత్యంత పోషకమైన ఆహారంగా గుర్తించింది. మన దేశంలో దీన్ని అనధికారికంగా జాతీయ ఆహారంగా కూడా పిలుస్తారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా కిచిడీని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పి దాని ప్రాధాన్యం వివరించారు. సెప్టెంబర్ నెలను భారతదేశంలో పోషకాహార మాసంగా జరుపుకుంటారు. దీని ఉద్దేశ్యం ప్రజలకు మంచి ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడం, పోషకాహార లోపాన్ని తగ్గించడం. అయితే, మోస్ట్ న్యూట్రిషస్ ఫుడ్‌గా కిచిడీని ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
కిచిడీ ఎందుకు ప్రత్యేకం?
కిచిడీని సాధారణంగా బియ్యం, పప్పు (కాయధాన్యాలు)తో తయారుచేస్తారు. ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అన్నీ లభిస్తాయి. ఒకే ఆహార పదార్థంలో అన్ని రకాల పోషకాలు లభించడం చాలా అరుదు. పప్పులో లేని కొన్ని అమైనో ఆమ్లాలు బియ్యంలో ఉంటాయి, బియ్యంలో లేనివి పప్పులో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తింటే 20-22 రకాల అమైనో ఆమ్లాలు లభిస్తాయి. ఇవే ప్రోటీన్‌కు ప్రధాన ఆధారం. అందుకే కిచిడీని అత్యంత పోషకమైన ఆహారమని అంటారు.
కిచిడీ రుచికరంగా ఉండటమే కాకుండా తేలికగా జీర్ణమవుతుంది. అందుకే పిల్లలు, పెద్దలు, అనారోగ్యంతో ఉన్నవారు అందరూ తినవచ్చు. అంతేకాకుండా కిచిడీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పోషకాలను అందిస్తుంది, శరీరానికి శక్తిని ఇస్తుంది, నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. దీనిని అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా తేలికపాటి ఆహారం అవసరమైనప్పుడు తినడం మంచిది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే ఫోలేట్ అందిస్తుంది. తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కూరగాయలు కలిపి వండితే పోషక విలువ ఇంకా పెరుగుతుంది. కిచిడీ శరీరానికి కావలసిన దాదాపు అన్ని పోషకాలను అందిస్తుంది. అందుకే భారతదేశం మాత్రమే కాకుండా, ప్రపంచం కూడా దీన్ని ప్రోటీన్ శక్తి కేంద్రంగా గుర్తించింది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
































