ప్రస్తుత కాలంలో అధిక బరువు అనేది చాలా మందికి ఒక పెద్ద సమస్యగా మారింది. బరువు తగ్గడానికి రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొంతమంది వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెడుతున్నారు.
అందులో భాగంగా చపాతీకి బదులుగా రాగి, జొన్న రొట్టెలను తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి ఎక్కువ సహాయపడుతుందో తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రొట్టె, రాగి రొట్టె మంచి ప్రత్యామ్నాయాలు. ఈ రెండింటిలోనూ ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా సేపు కడుపు నిండినట్లు అనిపించేలా చేసి, అనవసరంగా తినకుండా ఆపుతాయి. అలాగే ఆరోగ్యకరమైన జీవక్రియకు కూడా ఇవి సహాయపడతాయి.
జొన్న రొట్టె :బరువు తగ్గాలనుకునే వారు జొన్న రొట్టెను క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచి, బరువును అదుపులో ఉంచుతుంది.
రాగి రొట్టె : రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఫైబర్, కార్బోహైడ్రేట్లు బరువు తగ్గడానికి తోడ్పడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రేగుల పనితీరును ఆరోగ్యంగా ఉంచుతుంది. రాగి రోటీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఇది కడుపు నిండుగా ఉంచి, చిరుతిళ్లను తినే అలవాటును తగ్గిస్తుంది.
ఏది ఉత్తమం? బరువు తగ్గడం కోసం ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పోల్చి చూస్తే, జొన్న రొట్టె ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతుంది. అందువల్ల బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి రాగి రొట్టె కంటే జొన్న రోటీ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
































