కాకరకాయ గింజలు తింటే ఏమవుతుంది? నమ్మలేని నిజాలు

కాకరకాయ పేరు వింటేనే చాలామంది ముఖం చిట్లించుకుంటారు. అబ్బా వేరే కూర లేదా అని అడుగుతారు. కాకరకాయ తీవ్రమైన చేదు రుచే దానికి కారణం. కానీ ఆ చేదు వెనుక దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.


అందుకే ఆరోగ్య స్పృహ ఉన్నవారు కాకరకాయను అమృతంలా భావిస్తారు. అయితే కాకరకాయను వండేటప్పుడు మనందరి మదిలో మెదిలే ఒక డౌట్ ఏంటంటే..లోపల ఉన్న గింజల సంగతేంటి? వాటిని తినవచ్చా? లేక పారేయాలా?. చాలామంది పెద్దగా ఆలోచించకుండా వాటిని కూరతో పాటే తినేస్తుంటారు. కానీ తెలియక చేసే ఈ చిన్న పొరపాటు కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మీకు తెలుసా?

గింజల్లో దాగి ఉన్న ప్రమాదం

కాకరకాయ గింజలలో మోమోర్డిసిన్,లెక్టిన్ అనే రెండు ప్రత్యేక రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వీటిని పరిమితంగా తీసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు కానీ మోతాదు మించితే మాత్రం ఇవి మన శరీరంలో విషపదార్థాలుగా మారే ప్రమాదం ఉంటుంది. కాకరకాయ గింజలను అధికంగా తినడం వల్ల శరీరంపై విషపూరిత ప్రభావం పడి పలు రకాల అనారోగ్య లక్షణాలు బయటపడతాయి. అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి రావడం, ఆగకుండా వాంతులు లేదా విరేచనాలు అవ్వడం, కళ్లు తిరిగి మైకంగా అనిపించడం, తీవ్రమైన నీరసం ఆవహించడం వంటివి ప్రధాన లక్షణాలు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో కాలేయంపై ప్రభావం పడి కళ్ళు, మూత్రం పసుపు రంగులోకి మారే అవకాశం కూడా ఉంటుంది.

వీరు అస్సలు తినకూడదు

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాకరకాయ గింజలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ గింజలలో ఉండే కొన్ని పదార్థాలు గర్భాశయంలో సంకోచాలను ప్రేరేపిస్తాయి. దీనివల్ల నెలలు నిండకముందే ప్రసవం జరగడం లేదా గర్భస్రావం అయ్యే పెను ప్రమాదం పొంచి ఉంది. అలాగే పసిపిల్లల జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. వారికి ఈ గింజలను తినిపించడం వల్ల తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లల విషయంలో ఈ గింజలను పూర్తిగా నివారించడమే ఉత్తమమైన మార్గం.

మధుమేహులు మరింత అప్రమత్తంగా ఉండాలి

కాకరకాయ రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే దాని గింజలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడుతూ ఇప్పటికే మందులు వాడుతున్న వారు కాకరకాయ గింజలను అధికంగా తింట, వారి రక్తంలో షుగర్ లెవల్స్ ప్రమాదకరంగా, అకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

ప్రతి గింజ ప్రమాదకరమని కాదు

కూరలో అక్కడక్కడా కనిపించే రెండు, మూడు లేత గింజలు తినడం వల్ల పెద్దగా హాని జరగదు. కానీ ముదిరిన, గట్టి గింజలను, ముఖ్యంగా పచ్చిగా లేదా దోరగా ఉన్నవాటిని పెద్ద మొత్తంలో తినడం మాత్రం కచ్చితంగా ప్రమాదకరం. అందుకే,సురక్షితమైన మార్గం ఏంటంటే.. కాకరకాయను వండటానికి ముందే దానిలోని గింజలను, ముఖ్యంగా ముదిరిన వాటిని తొలగించడం. దీంతో ఎలాంటి భయం లేకుండా కాకరకాయలోని సంపూర్ణ పోషకాలను ఆస్వాదిస్తూ దాని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.