రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కోక్కరికి రూ 1.25 కోట్ల భీమా – మార్గదర్శకాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తోంది. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించే నిర్ణయం ప్రకటన కు సిద్దం అయింది.


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా సదుపాయానికి అడుగులు పడుతున్నాయి. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి రికార్డు స్థాయిలో రూ.1.25 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకు ప్రమాద జీమా పథకం అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారిక నిర్ణయం పైన కసరత్తు కొనసాగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ ఒక్కరికీ భీమా కల్పించే అంశం పైన తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ వివిధ బ్యాంకుల యాజమాన్యాలతో అంతర్గత చర్చలు జరుపుతోంది. బ్యాంకులో శాలరీ ఎకౌంట్‌ ఉన్న ప్రభుత్వోద్యోగులు అందరికీ దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ప్రమాద, ఆరోగ్య బీమా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సింగరేణి ఉద్యోగులు, కార్మికులు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.కోటి బీమా ఇచ్చేలా సంస్థ పలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది. శాలరీ ఎకౌంట్‌ ఉన్న ప్రతి కార్మికునికి రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే శాలరీ ఎకౌంట్‌ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంకులు పలు సదుపాయాలు కల్పిస్తున్నాయి.

ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సదుపాయం కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. శాలరీ ఎకౌంట్‌ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి బ్యాంకు రూ.కోటి బీమా చెల్లిస్తోంది. విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.1.60 కోట్లు, రూపే డెబిట్‌ కార్డు ఉంటే మరో రూ.కోటి ఇస్తోంది. అదే విధంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.కోటి, సహజ మరణం అయితే రూ.10 లక్షలు అందజేస్తోంది. నెలకు రూ.2,495 ప్రీమియం చెల్లిస్తే గరిష్ఠంగా రూ.30 లక్షల వరకూ ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇంతకన్నా మెరుగ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు బ్యాంకులతో తెలంగాణ ఆర్దిక శాఖ అధికారులు చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఉద్యోగ సంఘాలతోనూ చర్చించి.. అమలు విధి విధానాలు ఖరారు చేయనున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.