ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపికబురు ప్రకటించింది. డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ.. వారి కుటుంబానికి అండగా నిలిచేలా మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతోంది.
పిల్లల విద్యా ఖర్చుల కోసం “ఎన్టీఆర్ విద్యాలక్ష్మి”.. ఆడబిడ్డల వివాహాం కొరకు “ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి” పథకాలు త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది.
ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ స్కీంలకు ఆమోదం తెలిపారని సమాచారం. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డాయని.. మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పథకాలు ఎవరికీ వర్తిస్తాయి?
ఈ రెండు పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు వర్తిస్తాయి. అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నవారికి మాత్రమే అర్హత ఉంటుంది. పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహించనున్నారు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి..
- ఈ పథకం కింద ఒక మహిళ గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం రుణ సాయం పొందవచ్చు.
- రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు అవసరాన్ని బట్టి రుణం లభిస్తుంది.
- వడ్డీ రేటు కేవలం 4 శాతం (పావలా వడ్డీ) మాత్రమే.
- గరిష్ఠంగా 48 వాయిదాలలో రుణం చెల్లించాలి.
- అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు, విద్యాసంస్థ వివరాలు సమర్పించాలి.
- దరఖాస్తు చేసిన 48 గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది.
ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి..
- డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం పనిచేస్తుంది.
- రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణం పొందవచ్చు.
- వడ్డీ రేటు 4 శాతం (పావలా వడ్డీ).
- గరిష్ఠంగా 48 వాయిదాలలో చెల్లించాలి.
- లగ్నపత్రిక, వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి.
- వివరాల పరిశీలన అనంతరం, వధువు తల్లిదండ్రుల ఖాతాలో నేరుగా డబ్బు జమ అవుతుంది.
ఏడాదికి రూ.2000 కోట్లు..
ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరం రూ.2000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అందులో విద్యాలక్ష్మి కోసం రూ.1000 కోట్లు.. కళ్యాణ లక్ష్మి కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో 50 శాతం డ్వాక్రా సంఘాల బలోపేతానికి వినియోగిస్తారు. మిగిలిన 50 శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించనున్నారు.
అంతే కాకుండా ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తూ ప్రమాదంలో మరణిస్తే.. ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.































