విజయవాడ గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన రోబో షెఫ్ స్టాల్‌ను సీఎం చంద్రబాబు గురువారం ప్రత్యేకంగా పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితర నేతలు, అధికారులు ఉన్నారు. రోబో షెఫ్ స్టాల్ లాంటి వాటిని ప్రోత్సహించాలని.. నేతలు, అధికారులకు సీఎం సూచించారు. స్టాల్‌లోని కుర్రాళ్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. రోబో షెఫ్ బాగా వండుతోందా? వంటకోసం ఐటమ్స్ అన్నింటినీ సరిగా మిక్సింగ్ చేస్తోందా? గంటకు ఎన్ని ప్లేట్లు తయారు చేస్తుంది? ఏమేం చేస్తుంది? సందర్శకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారా?.. అని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రోబో షెఫ్ తయారుచేసిన ఆహారాన్ని తిని.. రుచి బాగుందని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర చిట్‌చాట్ ఇదీ…
చంద్రబాబు: స్టాల్‌లో ఎన్ని రకాల ఆహారం తయారుచేస్తున్నారు?
స్టాల్ నిర్వాహకులు: బిర్యానీ, చిల్లీ పన్నీర్, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ ఫ్రైడ్‌రైస్… ఈ నాలుగు రకాలు ప్రస్తుతం అందిస్తున్నాం సార్.
చంద్రబాబు: రెడీగా ఏముందయ్యా?
స్టాల్ నిర్వాహకులు: చిల్లీ పన్నీర్ ఉంది సార్.
చంద్రబాబు: సరే ఒక ప్లేట్ ఇవ్వు.
ఎమ్మెల్యే కృష్ణప్రసాద్: రుచి ఎలా ఉంది సార్?
చంద్రబాబు: బాగుంది. కొద్దిగా కారం తగ్గించాలి.
ఎంపీ శివనాథ్: విజయవాడ, గుంటూరు వారికి కొద్దిగా కారం ఉండాలి సార్..
చంద్రబాబు: విజయవాడ కాదు… గుంటూరుకు. మీరు కూడా తినండి.(ప్లేటులోని పన్నీర్‌ను పక్కనున్న నాయకులకు అందించారు)
ఈ సాంకేతికతను పూర్తిగా ఉషారామ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులే అభివృద్ధి చేశారని నిర్వాహకులు చెప్పగా.. ‘విజయవాడలో చాలా తెలివైన వారున్నారు. కాకపోతే.. సరిగా ఉపయోగించుకోవడం లేదు..’ అని చంద్రబాబు సరదాగా అన్నారు.
































