దసరాకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ నగరం చేరుకునేందుకు ఆదివారం క్యూ కట్టారు. వాహనాలతో జాతీయ రహదారులు, ప్రయాణీకులతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. జాతీయ రహదారులపై అదనపు బస్సులే కాకుండా సొంత వాహనాల్లో వచ్చే వారితో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజాల దగ్గర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి, బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ ఏర్పడింది. బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై వందలాది వాహనాలు హైదరాబాద్‌కు ఒక్కసారిగా రావడంతో జడ్చర్ల నుంచి హైదరాబాద్ వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో నగర శివారుల్లోని రోడ్లన్నీ కూడా వాహనాలతో నిండిపోయాయి. శని, ఆదివారాలు కూడా పండుగకు కలిసి రావడంతో వరుస సెలవుల్లో ఉన్న వారు ఆదివారం సాయంత్రానికి నగరానికి చేరుకున్నారు.
సోమవారం నుంచి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పని చేయడం ప్రారంభించనున్నాయి. దీంతో ఆదివారం సాయంత్రానికి ఎక్కువ మంది హైదరాబాద్ చేరుకున్నారు. వీరందరి రాకతో నగరంలోని సిటీ బస్సులే కాకుండా జూబ్లీ బస్ స్టేషన్, ఎంజిబిఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ, చర్లపల్లి స్టేషన్లకు ప్రయాణీకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర ఎన్‌హెచ్ 65పై వాహనాల రద్దీ కనిపించింది. చిట్యాల జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటం, మరో వైపు దసరా సెలవులు ముగియడంతో ఊర్ల నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్తున్న వాహనాల సంఖ్య కూడా పెరగడంతో ట్రాఫిక్ పెరిగి వాహనాలు ఆలస్యంగా నడిచాయి. నగరానికి సమీపంలో ఉన్న జిల్లాలకు ద్విచక్రవాహనాలపై వెళ్లిన వారు కూడా తమతమ వాహనాలతో తిరిగి చేరుకున్నారు. కాగా కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ వైపు ఎనిమిది టోల్ ప్లాజాలు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. ఈ క్రమంలో టోల్ ప్లాజాల దగ్గర మరింత ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించడం వల్ల రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పట్టణాలకు వెళ్లిన వారు శనివారం రాత్రి నుంచే హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై కిక్కిరిసిన వాహనాలతో ఏర్పడిన వాహన రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, టోల్‌ప్లాజా సిబ్బంది పెద్ద ఎత్తున ప్రయత్నించారు. హైదరాబాద్ వైపు వెళ్లే రూట్లో కార్లు, బస్సులు తదితర వాహనాలు ఒకేసారి భారీ సంఖ్యలో రావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ నివారణకు టోల్ బూతుల సంఖ్యను కూడా పెంచారు. వాహనాల క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ చౌటుప్పల్ పట్టణానికి వచ్చేసరికి తంగడపల్లి చౌరస్తా, చిన్నకొండూరు చౌరస్తా, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వద్ద ఉన్న రోడ్డు క్రాసింగ్‌ల వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ట్రాఫిక్ జామ్ కారణంగా రెండు గంటలపాటు ప్రయాణం చేసినా కనీసం 15 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం సాగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. వందలాది ప్రత్యేక బస్సులు ఆర్టీసి నడపడంతో ఆ బస్సులు కూడా ఆలస్యంగా నగరానికి చేరుకున్నాయి. ముఖ్యంగా మహిళలు ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించడంతో మహిళా ప్రయాణీకులతో విపరీతంగా రద్దీ ఏర్పడింది. చాలా సర్వీసులను నగర శివారుల వరకే నడపడం వల్ల అక్కడి నుంచి సబర్బన్, సిటీ బస్సుల్లో చేరుకుంటున్నారు. దీంతో ఆదివారం అన్ని దారులు వాహనాలతో నిండిపోయాయి.
































