ఓ పల్లెటూరికి వచ్చే వారు బస్సులోనో, ఆటోలోనో, బైక్‌పైనో వస్తారు.. మహా అంటే కారులో కూడా వస్తారు. కానీ ఓ మహిళ పల్లెటూర్లోని తన తల్లిగారింటికి తన భర్త, పిల్లలతో కలిసి ఏకంగా హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చింది.
ఈ విచిత్ర ఘటన చూసేందుకు మొత్తం ఊరంతా ఏకమైంది.
కొల్హాపూర్ జిల్లాలోని తోపేకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అట్పాడి గ్రామానికి చెందిన అల్లుడు శివాజీరావు ఆనందరావు పవార్ తన భార్య శశికళ శివాజీరావు పవార్, వారి పిల్లలు సౌరభ్, సుయోగ్ పవార్‌లతో కలిసి శనివారం మధ్యాహ్నం తన కొత్త హెలికాప్టర్లో అట్పాడికి చేరుకున్నారు.
అట్పాడి ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్‌ను చూసేందుకు ఆ గ్రామంలోని ప్రజలంతా బయటికి వచ్చారు. తమ ఊర్లో దిగిన హెలికాప్టర్‌ను దగ్గర్నుంచి చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. సౌరభ్, సుయోగ్ పవార్ ల మామలు యోగేష్, రవీంద్ర నంగ్రే అట్పాడిలో నివసిస్తున్నారు.
వారి మేనల్లుళ్ళు కొనుగోలు చేసిన హెలికాప్టర్‌ను పూజించడానికి వారు కుటుంబాన్ని ప్రత్యేకంగా అట్పాడికి ఆహ్వానించారు. నాంగ్రే కుటుంబం హెలికాప్టర్‌ను సాంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర బ్యాంకు డైరెక్టర్ తానాజీ పాటిల్, యువ నాయకుడు దత్తాత్రే పాటిల్, అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
గ్రామంలో హెలికాప్టర్ ల్యాండ్ అయిందనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలతో హల్చల్ చేశారు. దీంతో అట్పాడిలో సందడి వాతావరణం నెలకొంది. వాహన పూజ సంప్రదాయంలో హెలికాప్టర్ పూజను చేర్చడంతో ఈ రోజు అట్పాడిలో దాని గురించే మాట్లాడుకున్నారు.
































