బీసీ రిజర్వేషన్ల పై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.  బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరులో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది.


తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పై పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి నిన్న  సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మనుసింఘ్వీ, సిద్ధార్థ్‌ దవేతో ఫోన్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్‌, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్‌, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ని తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో చర్చించారు. జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి నిన్నఆదివారం ఢిల్లీ వెళ్లారు. వారి వెంట బీసీ సంక్షేమం, సంబంధిత శాఖల అధికారులు కూడా ఉన్నారు. జీవో 9కి అనుకూలంగా ప్రభుత్వం తరఫున వాదన లు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీతో వారు భేటీ అయ్యారు. కులగణన సర్వే మొదలుకుని జీవో 9 జారీకి దారి తీసిన పరిస్థితులు, ఇతర అంశాలను ఆయన కు వివరించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.