వందేండ్ల జీవనానికి జపాన్‌ 5 సూత్రాలు

తాధిక వృద్ధులు అధికంగా ఉన్న దేశాల్లో జపాన్‌ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇలా వందేండ్లు పైబడిన వారి సంఖ్య ఏటికేడూ పెరుగుతూ ఉంది. వరుసగా 55వ సంవత్సరమూ ఈ పెరుగుదల నమోదైందని జపాన్‌ ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది.


అయితే ఇలా నిండైన జీవితానికి జపాన్‌ పాటించే అయిదు పండంటి సూత్రాలను అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం.

1. వాషోకు (ఆహారం)

తినే ఆహారాన్ని ఔషధంగా పేర్కొంటారు జపనీయులు. చేపలు, కూరగాయలు, పులియబెట్టిన ఆహారం ఇందులో ప్రధానంగా ఉంటుంది. ప్రాసెస్‌ చేసిన చక్కెరలకు దాదాపు దూరంగా ఉంటారు. మాంసం మితంగా తింటారట. అక్కడి సంప్రదాయ వంటల్లో సోయాబీన్‌ ఎక్కువగా వాడతారు. ఇందులో కొవ్వుల శాతం అత్యల్పం. అందువల్ల పురుషులతో పాటు మహిళల్లోనూ ఊబకాయం అరుదు.

2. యుగోకి (కదలికలు)

శరీరాన్ని చురుగ్గా ఉంచడం అన్నది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విషయం. అలాగని జిమ్‌కి వెళ్లడం లేదా కష్టమైన వర్కవుట్లు సాధన చేయడంలాంటివి చేస్తారని కాదు. సహజంగానే నిరంతరం ఏదో ఒక రకంగా శరీరాన్ని కదుపుతూ ఉంటారిక్కడి వారు. కొద్దిపాటి నడక, కూరగాయలు తేవడం, ఇంటి పనులు చేస్తూ ఉండటంలాంటి వాటి వల్ల శరీరం, మెదడు అనుసంధానమై పనిచేస్తూ ఉంటాయి.

3. మోయి (సామాజిక అనుబంధాలు)

ఈ దేశంలోని ఒకినావా అనే ప్రాంతంలో ప్రజలు మరింత మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ ప్రజలు చిన్న చిన్న సమూహాలుగా జీవిస్తారు. వారంతా సామాజిక, మానసిక దన్నుని అందించుకోవడమే కాదు ఆర్థికంగానూ ఒకరికొకరు అండగా ఉంటారు. ఇలాంటి చోట్లను బ్లూ జోన్లుగా పిలుస్తారు. ఇలా బ్లూ జోన్లలో ఉండే వారు ఒంటరితనం దరిచేరకుండా బలమైన బంధాల మధ్య సంతోషంగా జీవిస్తున్నారనీ నివేదికలు చెబుతున్నాయి.

4. ఇకిగాయ్‌ (అర్థవంతంగా జీవించడం)

జపాన్‌ భాషలో బాగా ప్రాచుర్యం పొందిన పదం ఇకిగాయ్‌. మన జీవితాన్ని మనమే అర్థవంతంగా మలచుకోవడం అన్నదే ఇందులోని సౌందర్యం. మనం ఏర్పరచుకునే విలువైన అభిరుచులు, కుటుంబ బాధ్యతలు, స్వచ్ఛంద సేవలాంటివెన్నో మన జీవితానికి ఒక అర్థాన్ని చేకూరుస్తున్నాయని చెప్పే అక్కడి పెద్దలు.. ఈ సూత్రాలను అక్షరాలా పాటిస్తారు. తాము కూడా ఏదో రకంగా ఉపయోగకరమైన వారిమే అన్న భావన ఎవరికి వారే కల్పించుకోగలగడమే ఈ ఇకిగాయ్‌.

5. నివారణ

ఈ ద్వీప దేశపు ఆరోగ్య వ్యవస్థ చికిత్స కన్నా నివారణ మీదే అధిక శ్రద్ధ పెడుతుంది. ఎప్పటికప్పుడు చెకప్‌లు, స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేస్తూ ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉండటం, వ్యాధి ముదరక ముందే కనిపెట్టి చికిత్స అందించడం ఇక్కడి మాడల్‌. వీటితో పాటు ప్రజల ఆరోగ్యకరమైన అలవాట్ల కారణంగా పశ్చిమ దేశాలతో పోలిస్తే ఇక్కడ డయాబెటిస్‌, గుండెజబ్బులు చాలా తక్కువ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.