పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఓ సారి ఇలా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. పదార్థాలన్నీ రెడీగా ఉంటే చాలు కట్ చేసి కలిపేస్తే సరిపోతుంది. చాలా మంది చల్లటి సాయంత్రం వేళలో వేడి వేడి మిర్చీ బజ్జీ, పకోడీ, పునుగులు కోరుకుంటారు. అలాంటి వారికి ఇలా ఇంట్లోనే చేసి పెడితే బయట బండి మీద కొనాలన్న ఆలోచన కూడా రాదు. ఇక్కడ ఇచ్చిన స్నాక్ ఎంతో రుచిగా, క్రంచీగా ఉంటుంది.
కావల్సిన పదార్థాలు :
- బంగాళాదుంపలు – 2
- ఉల్లిపాయ – 1
- పచ్చిమిర్చి – 3
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
- కరివేపాకు – 2 రెమ్మలు
- కొత్తిమీర – చిన్న కట్ట
- వాము – 1 స్పూన్
- పసుపు – పావు స్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- కారం – అర స్పూన్
- ధనియాల పొడి – 1 స్పూన్
- నువ్వులు – 1 స్పూన్
- బియ్యం పిండి – అర కప్పు
- శనగపిండి – పావు కప్పు
- కార్న్ – 2 టేబుల్ స్పూన్లు
-
తయారీ విధానం :
- ముందుగా బంగాళాదుంపలు ఉడికించకుండానే పొట్టు తీసుకుని గ్రేటర్‌తో తురుముకోవాలి. తురుముకోవడం కష్టంగా అనిపిస్తే సన్నగా, పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత బంగాళాదుంప తురుము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
- వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కరివేపాకు, కొత్తిమీర ఆకు కట్ చేసి వేసుకోవాలి. కొత్తి మీరకు బదులు మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఆకు కూర వేసుకోవచ్చు. పాలకూర లేదా, మెంతి ఆకు ఇంకా బాగుంటుంది.
- ఆ తర్వాత వాము, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, నువ్వులు వేసుకుని బాగా మర్దనా చేస్తూ కలపాలి. స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇపుడు బియ్యం పిండి, శనగపిండి, కార్న్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు తీసుకున్న బంగాళాదుంపల సైజ్ ఆధారంగా పిండి ఎక్కువ, తక్కువ కలుపుకోవాలి.
- అంతా పకోడీ పిండి మాదిరిగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇపుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని హై ఫ్లేమ్‌లో వేడి చేసుకోవాలి. మంట తగ్గించి పిండి ముద్దను మీకు నచ్చిన షేప్‌లో వేసుకుని వేయించాలి. వేసిన వెంటనే గరిటె పెట్టకుండా నూనెలో తేలగానే బాగా కలుపుతూ రంగు మారేదాకా వేయించుకోవాలి.
































