తెలంగాణలో 2 కొత్త రైల్వే లైన్లు.. ఈ ప్రాంతాల మధ్యే, గంట ప్రయాణ సమయం ఆదా

తెలంగాణలో కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని కీలక రైల్వే మార్గాలలో ఒకటైన కాజీపేట-సికింద్రాబాద్ సెక్షన్ మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ప్రతిపాదించింది.


ప్రస్తుతం ఉన్న మార్గానికి అదనంగా మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. రైల్వే ట్రాఫిక్ రద్దీని తగ్గించి, రైళ్ల వేగాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.

అందుకు సుమారు రూ. 2,837 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. మెుత్తం 110 కిలోమీటర్లు మేర ఈ అదనపు లైన్లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, సికింద్రాబాద్-కాజీపేట మధ్య ప్రయాణ సమయం గంట వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణానికి దాదాపు రెండున్నర నుంచి 3 గంటలు పడుతోంది. కొత్త లైన్ల ద్వారా ఇది 2 గంటల లోపుగా తగ్గే అవకాశం ఉంది. అదనంగా రెండు లైన్లు అందుబాటులోకి వస్తే, ఆ మార్గంలో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీటర్ల నుండి 150 కి.మీటర్ల వరకు పెంచడానికి వీలు కలుగుతుంది.

కాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గం తెలంగాణలోనే కాకుండా, దక్షిణాది, ఉత్తర, తూర్పు భారత దేశాల మధ్య రాకపోకలకు ఒక ముఖ్యమైన కారిడార్‌గా ఉంది. ఈ మార్గంలో ప్రయాణీకుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్త రైల్వే లైన్లతో రైళ్లు ఆలస్యం కాకుండా.. ఎక్కువ సంఖ్యలో రైళ్లను సులభంగా నడపడానికి అవకాశం లభిస్తుంది. గూడ్స్ రైళ్లను వేరుగా నడపడం ద్వారా సరుకు రవాణా వేగం పెరిగి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుంది. తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం తుది ఆమోదం కోసం ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఈ భారీ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.