రోడ్ సైడ్ టిఫిన్స్ లేదా స్నాక్స్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు! వేడివేడి తినుబండారాలతో పాటు అందులోకి వేసే చట్నీలంటే నోరూరుతుంది. మరి ఆ చట్నీలను ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో ఓసారి చేశారంటే సేమ్ ఆ విధంగానే వస్తుంది.
టమోటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు :
- టమోటాలు- 5
- ఉల్లిపాయ – 1
- ఎండుమిర్చి – 6
- వెల్లుల్లి – 1
- అల్లం – కొద్దిగా
- జీలకర్ర – 1 టీ స్పూన్
- చింతపండు – కొంచెం
- కారం – 1 టీ స్పూన్
- నూనె – 1 టేబుల్ స్పూన్
- ఆవాలు – 1 టీ స్పూన్
- మినపప్పు – 1 టీ స్పూన్
- కరివేపాకు – కొంచెం
- శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
-
తయారీ విధానం :
- ముందుగా మిక్సీజార్‌లో ఐదు టమోటా ముక్కలు వేయాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆరు ఎండుమిర్చి, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే రెండు ఇంచుల అల్లం, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక టీ స్పూన్ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
- మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
- ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. అనంతరం మరో టేబుల్ స్పూన్ శనగపిండి వేసి రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.
- అలాగే ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా మిశ్రమం, సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఎనిమిది నిమిషాల పాటు ఉంచి మరిగించాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కకు దించుకున్నారంటే వేడివేడి టమోటా పచ్చడి మీ ముందుటుంది!
-
కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు :
- పచ్చికొబ్బరి ముక్కలు – అర కప్పు
- పుట్నాలు – అర కప్పు
- పచ్చిమిర్చి – 3
- వెల్లుల్లి – 1
- అల్లం – కొంచెం
- ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
- మినపప్పు – 1 టీ స్పూన్
- ఆవాలు – 1 టీ స్పూన్
- జీలకర్ర – 1 టీ స్పూన్
- ఎండుమిర్చి – 5
- కరివేపాకు – కొద్దిగా
- ఉప్పు – రుచికి సరిపడా
-
తయారీ విధానం :
- మిక్సీజార్‌లో అర కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేయాలి. అలాగే అర కప్పు పుట్నాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, సరిపడా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసుకోవాలి.
- ఇంకోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలక్రర, ఐదు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- అనంతరం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో తాలింపును వేయాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి.
- ఇక అంతే టేస్టీటేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయినట్లే.
































