బంగాళాఖాతంలో వాయుగుండం : తడవనున్న తెలంగాణ – మునగనున్న ఆంధ్ర

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. ఏపీ, తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.


పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ అయ్యాయి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది ప్రస్తుతం అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపు మధ్యాహ్నానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాతి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని చెప్పారు.

ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు అన్ని జిల్లాల్లో సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని హెచ్చరించారు.

దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా చిలమనూరు (79 మిమీ), నెల్లూరు జిల్లా ఆత్మకూరు (77.2 మిమీ), గొల్లగుంట (68.5 మిమీ) ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందని APSDMA తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల సూచనలున్నాయి. రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

బుధవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సిద్దిపేట, వరంగల్‌, భువనగిరి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్‌ వద్ద నిలబడి ఉండరాదని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800-425-0101 ద్వారా కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించవచ్చని APSDMA వెల్లడించింది.

తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రతను బట్టి జిల్లా యంత్రాంగం హై అలర్ట్‌లో ఉందన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.