విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలి

విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు అలవర్చుకోవాలని చల్వాయి తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ కమాండెంట్‌ కె.సుబ్రహ్మణ్యం అన్నారు.


మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని మోడల్‌ స్కూల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ చల్వాయి విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని తెలిపారు. విద్యార్థి దశ నుంచే మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటేనే దేశ పురోగతిలో భాగస్వాములు అవుతారని వివరించారు. అనంతరం అదనపు కమాండెంట్‌ సీతారాం విద్యార్థులకు వివిధ రకాల ఆయుధాలు, వాటి పనితీరు వివరించారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కార్యకలాపాలు, పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ వేణుగోపాల్‌ రెడ్డి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు భాస్కర్‌, సాయి బాబు, వెంకటేశ్వర్లు తదితర బెటాలియన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.