వీకెండ్ వచ్చిందంటే చాలా మంది చికెన్, మటన్‌తో పాటు చేపలు వండుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు చేపలు పులుసు చేసుకోవడానికి ఇష్టపడితే, మరికొందరు వేపుడు చేసుకోవడం చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఎంత బాగా వండినా చేపల కర్రీ నీచు వాసన రావడమో, మంచి రుచికరంగా కుదరకపోవడమో జరుగుతుంది. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో “టమాటా చేపల కూర” వండి చూడండి. నీచు వాసన లేకుండా చిక్కని గ్రేవీతో నోరూరించే ఈ కర్రీని ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. అలాగే, ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తేలిక! బిగినర్స్ కూడా ఈ చేపల కూరను సింపుల్‌గా, రుచికరంగా రెడీ చేసుకోవచ్చు. మరి, నోరూరించే ఈ టమాటా ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఏదైనా ఓ రకం చేప – అరకేజీ
- ఉప్పు – రుచికి తగినంత
- పసుపు – ఒకటిన్నర చెంచా
-
కర్రీ కోసం :
- ఆవనూనె – అరకప్పు
- జీలకర్ర – ఒక చెంచా
- కలోంజీ గింజలు – అరచెంచా
- ఉల్లిపాయ – ఒకటి
- టమాటాలు – ఐదు
- వెల్లుల్లి పేస్ట్ – అరచెంచా
- అల్లం ముద్ద – అరచెంచా
- పచ్చిమిర్చి – నాలుగైదు
- ధనియాలపొడి – అరచెంచా
- కారం – మూడు చెంచాలు(తగినంత)
- చక్కెర – పావుచెంచా
-
పచ్చిమిర్చి (Getty Images)
తయారీ విధానం :
- నోరూరించే ఈ చేపల కర్రీ తయారీ కోసం ముందుగా అరకేజీ పరిమాణంలో ఏదైనా ఒక రకం చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా కడగాలి.
- ఆపై వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చెంచా పసుపు, చెంచా ఉప్పు వేసి ఆ రెండూ చేప ముక్కలకు పట్టేలా కలిపి కాసేపు పక్కనుంచాలి.
- తర్వాత ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకుని పేస్టులా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం కర్రీ తయారీ కోసం స్టవ్ మీద అందుకు అనుగుణంగా ఉండే కడాయిని పెట్టి పావుకప్పు ఆవనూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఇక్కడ ఆవనూనె లేని వారు రోజూ వాడే ఆయిల్‌ను యూజ్ చేయవచ్చు. కానీ, ఆవనూనె వేసి చేసుకోవడం ద్వారా సరికొత్త ఫ్లేవర్‌తో కర్రీ మంచి రుచికరంగా వస్తుంది.
- ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పక్కనుంచిన చేప ముక్కల్ని వేసి లో టూ మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- తర్వాత అదే కడాయిలో మిగిలిన నూనె వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కలోంజీ గింజలు వేసి వేయించాలి.
- అవి వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసి పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి.
- అనంతరం అందులో అల్లం ముద్ద, వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలపాలి.
- ఆపై లో ఫ్లేమ్‌లో టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు సాఫ్ట్‌గా మారాక ధనియాలపొడి, మిగిలిన పసుపు, కారం వేసి, అరకప్పు వాటర్ పోసి మిశ్రమం మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి.
- తర్వాత ఆ మిశ్రమంలో మరో అరచెంచా ఉప్పు, చక్కెర, వేయించి పక్కనుంచిన చేప ముక్కలు వేసి నెమ్మదిగా అంతా కలిసేలా బాగా కలపాలి.
- నెక్ట్స్ స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కూర దగ్గరపడి, లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని దింపేసుకుంటే చాలు. అంతే, సరికొత్త రుచిలో ఘుమఘుమలాడే “టమాటా చేపల కర్రీ” రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ స్టైల్లో ఫిష్ కర్రీ ట్రై చేయండి. నీచు వాసన లేకుండా కమ్మగా ఉండే ఈ కర్రీని ఇంటిల్లిపాదీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు!

































