అమరావతి రాజధానికి వెళ్లే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ-3 రోడ్డును పాత జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు కేఎల్‌రావు కాలనీ వద్ద కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై స్టీల్ వంతెన నిర్మించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) రూ.70 కోట్లతో పనులు ప్రారంభించింది. 128 మీటర్ల పొడవున నాలుగు లైన్లుగా డెల్టా కాలువపై నిర్మించే స్టీల్ వంతెన ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్‌కు వెళ్లే మార్గంలో కేఎల్‌రావు కాలనీ వద్ద రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీని పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పించినట్లు ఏడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. రాజధాని అమరావతికి వెళ్లే వాహనాలు కృష్ణా కరకట్ట మీద కాకుండా నేరుగా స్టీల్ వంతెన మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెళ్లిపోయే విధంగా వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇందుకుగాను పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ వద్ద వంతెనకు సంబంధించి పిల్లర్ నిర్మాణ పనులు చేపట్టారు.
మరో పైవంతెన సన్నాహం..
ఉండవల్లి సెంటర్లోని కేఎల్‌రావు కాలనీ వద్ద నుంచి 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ మరో పైవంతెన నిర్మించేందుకు సంకల్పించారు. కేఎల్ రావు కాలనీ నుంచి జాతీయ రహదారిని కలవాలంటే రోడ్డు మార్గంలో చెన్నై కలకత్తా రైలు మార్గంతోపాటు డెల్టా కాలువ ఉంది. వీటిపై నుంచి మరో వంతెన నిర్మాణానికి ప్రతిపాదించారు. త్వరలోనే దీని నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నట్లు ఏడీసీఎల్ అధికారులు తెలిపారు.
వేగంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు…
రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. పెనుమాక, ఉండవల్లి రైతులు రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ఇవ్వడంతో పనుల్లో వేగం పుంజుకున్నాయి. ఉండవల్లిలో ఇటీవల 12.40 ఎకరాలు రోడ్డు నిర్మాణానికి రైతులు తమ భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలను అందజేశారు. మరో 5.6 ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ కింద తీసుకోవాల్సి ఉంది. వారితో కూడా అధికారులు చర్చిస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి అమరావతి రాజధానికి వెళ్లేవారు డెల్టా కాలువపై నిర్మించే స్టీల్ వంతెన మీదుగా నేరుగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.
































