ఇండల్లో వెజ్, నాన్‌వెజ్ వంటలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ మంచి రుచికరంగా రావాలంటే వాటిల్లో ఆయిల్ తప్పనిసరిగా వాడాల్సిందే. కానీ చుక్క నూనె వాడకుండానే సూపర్ టేస్టీగా పులావ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో దీనిని చేశారంటే సూపర్‌గా వస్తుంది. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో చేసి పెడితే పిల్లలతో పాటు పెద్దలూ చాలా ఇష్టంగా తింటారు. మరి నోరూరించే వెజ్ పులావ్‌ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం – అర కిలో (500 గ్రాములు)
- ఉల్లిపాయ తరుగు – కొద్దిగా
- టమోటా ముక్కలు – పావు కప్పు
- పచ్చి బఠాణీలు – కొంచెం
- బంగాళదుంపలు – 2
- కాలీఫ్లవర్ – పావు కప్పు
- పచ్చిమిర్చి – 4
- పుదీనా – 3 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర తరుగు – 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
- నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా – అర టీ స్పూన్
- సోంపు – అర టీ స్పూన్
- సాంబార్ పొడి – 1 టీ స్పూన్
- జీలకర్ర – అర టీ స్పూన్
- పసుపు – అర టీ స్పూన్
- కారం – 2 టీ స్పూన్లు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
-
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా రెండు బంగాళదుంపలను కడిగి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అవసరమైన పరిమాణంలో ఉల్లిపాయ, టమోటాలను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అదేవిధంగా గిన్నెలో అర కిలో బియ్యం, సరిపడా నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ సోంపు వేసి లో ఫ్లేమ్‌లో వేగనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసి కలుపుతూ ఫ్రై చేయాలి.
- ఆనియన్స్ వేగాక మూడు టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేయాలి. అదేవిధంగా అర టీ స్పూన్ గరం మసాలా, రెండు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేగనివ్వాలి.
- ఆనంతరం కట్ చేసి పెట్టుకున్న టమోటా, బంగాళదుంప ముక్కలు వేయాలి. అలాగే పావు కప్పు కాలీఫ్లవర్, కొద్దిగా పచ్చి బఠాణీలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత మిక్స్ చేస్తూ వేయించాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమంలో నానబెట్టుకున్న బియ్యం, సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి.
- ఈ మిశ్రమం చక్కగా ఉడికిన తర్వాత చివరన ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి.
- అంతే ఆయిల్ లేకుండానే నోరూరించే వెజిటబుల్ పులావ్ తయారైనట్లే!

































