కేంద్ర ప్రభుత్వం ఇటీవల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ని ఆమోదించడంతో 8వ పే కమిషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. మరి వేతనాలు, భత్యాలు, పెన్షన్ ఎలా మారనుందో తెలుసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందేవారికి పెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్ పనికి ఇటీవల అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం వేతనాలు, భత్యాలు, పెన్షన్లలో మార్పులు తెచ్చే అవకాశాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ పే కమిషన్‌కి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టిఓఆర్)ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇవి కమిషన్ చేసే పనికి మార్గదర్శకాలు.
టిఓఆర్‌లో కమిషన్ వేతన నిర్మాణం, భత్యాలు, పెన్షన్‌ల సమీక్షను పరిశీలిస్తుంది. టిఓఆర్ ఖరారు చేయడానికి ముందు వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగుల సంఘాలతో విస్తృతంగా చర్చలు జరిగాయి. కమిషన్‌కి 18 నెలల్లో సిఫార్సులు సమర్పించే గడువు ఇచ్చారు. దీంతో కోట్లాది ఉద్యోగులు, పెన్షన్ పొందేవారికి వేతనాలు, భత్యాలు, పెన్షన్‌లు పెరగనున్నాయి.
ఏ మార్పు చేసినా దేశ ఆర్థిక పరిస్థితి, అవసరాలు జాగ్రత్తగా పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగులకు లాభం కలిగే మార్పులు చేసినా, దేశాభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల్లో ఎటువంటి తగ్గింపు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వేతనం, పెన్షన్ పెరుగుదలను నిర్ణయించే 5 ప్రధాన అంశాలు ఏవో తెలుసుకోండి.
మొదటిది కమిషన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తుంది. ప్రభుత్వానికి ఉన్న నిధులు, ఖర్చు చేసే సామర్థ్యం ఎంత అన్నది అంచనా వేస్తుంది. రెండోది అభివృద్ధి ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ పథకాల కోసం అవసరమైన నిధుల అవసరాన్ని గమనిస్తుంది. మూడోది కొన్ని పెన్షన్ పథకాలు పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. ఉద్యోగులు లేదా సంస్థలు వాటికి నిధులు ఇవ్వడం లేదు. ఇవి భవిష్యత్తులో ప్రభుత్వంపై భారమవకుండా చూసే విధంగా సమీక్ష చేస్తారు.
నాలుగోది చాలా రాష్ట్రాలు కేంద్ర పే కమిషన్ సిఫార్సులను స్వల్ప మార్పులతో అమలు చేస్తాయి. అందువల్ల దేశవ్యాప్తంగా ఒకే నిబంధనలు ఉండేలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితినీ పరిశీలిస్తారు. ఐదోది ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, భత్యాలు. పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ప్రైవేట్ రంగంతో పోల్చి మార్కెట్ పోటీ తత్వం కొనసాగించేందుకు చూస్తారు.
టిఓఆర్ అనేది కమిషన్‌కి మార్గదర్శకం లాంటి పత్రం. ఇది కమిషన్ చేసే పనికి హద్దులు, లక్ష్యాలు, పరిధిని నిర్దేశిస్తుంది. ఇందులో వేతన నిర్మాణం, భత్యాలు, పెన్షన్‌ల సమీక్ష వంటి అంశాలు ఉంటాయి. టిఓఆర్ లేకుండా కమిషన్ తన పని ప్రారంభించలేదు.
ప్రభుత్వం ఈ టిఓఆర్‌ను ఉద్యోగులు, పెన్షన్ పొందేవారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. ఎనిమిదవ పే కమిషన్ లక్ష్యంలో ఉద్యోగులు, పెన్షన్ పొందేవారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, పని జీవన పరిస్థితులను సులభతరం చేయడం ఉన్నాయి. తుది లాభాలు కమిషన్ సిఫార్సులపై ఆధారపడి ఉంటాయి.

































