హోటల్ రుచిని తలపించే కరకరలాడే వడలు (గారెలు) తయారు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు నిపుణులు తెలిపిన వంట చిట్కాలు పాటించటం ద్వారా ఎవరైనా సులువుగా రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేయవచ్చు.
పిండి తయారీ కీలకం
వడలు బాగా రావాలంటే పిండి (బాటర్) సరైన పద్ధతిలో ఉండాలి. ఉద్ది పప్పును సరిగా నానబెట్టాక, నీళ్లు తక్కువగా వేసి రుబ్బాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. పిండిలో ఒక చెంచా బియ్యపు పిండి కలిపితే వడలు కరకరలాడుతూ, మంచి టెక్చర్ వస్తుంది.
వేయించే పద్ధతి
నూనె ఉష్ణోగ్రత చాలా ముఖ్యం. బాగా వేడి అయిన నూనెలో వడలు వేయించాలి. అప్పుడే త్వరగా మంచి బంగారు రంగులో మారుతాయి. మరొక ముఖ్య విషయం ఏంటంటే… ఒకేసారి ఎక్కువ వడలు వేయకూడదు. కేవలం రెండు నుంచి మూడు వడలు మాత్రమే వేయటం ద్వారా అవి సరిగ్గా ఉడికి, నూనె కూడా ఎక్కువగా పీల్చవు. ఇలా తయారుచేసుకున్న వడలను పల్లీ చట్నీతో వేడి వేడిగా తింటే హోటల్ రుచి రావడం పక్కా.
ఈ సీక్రెట్ టిప్స్ తో వడల రుచి అమోఘం..
పప్పు రుబ్బేటప్పుడు సాధారణ నీళ్లకు బదులుగా చల్లటి నీళ్లు (లేదా ఐస్ వాటర్) మాత్రమే వాడాలి.
పిండి రుబ్బుతున్నప్పుడు మిక్సీ లేదా గ్రైండర్ వేడెక్కుతుంది. పిండి వేడెక్కకుండా ఉంటే, వడలు ఎక్కువ నూనె పీల్చకుండా, లోపల గుల్లగా, క్రిస్పీగా వస్తాయి.
రుబ్బిన పిండిని ఒక గిన్నెలో తీసుకుని, చేతితో కనీసం 5-7 నిమిషాలు ఒకే దిశలో బాగా గిలకొట్టాలి (బీట్ చేయాలి).
ఇలా చేయటం వల్ల పిండిలో గాలి బాగా చేరి తేలికగా మారుతుంది. ఇది వడలు లోపల మెత్తగా, బయట కరకరలాడటానికి సహాయపడుతుంది.
పిండి పర్ఫెక్ట్‌గా తయారైందో లేదో తెలుసుకోవడానికి, ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని చిన్న పిండి ముద్ద వేయండి.
ఆ ముద్ద నీటిపై తేలితే మాత్రమే పిండి సరిగా గాలి పట్టిందని అర్థం. అప్పుడు మాత్రమే వడలు పర్ఫెక్ట్‌గా వస్తాయి.
ఉప్పు, ఉల్లిపాయలు, అల్లం వంటివి చివరిలో మాత్రమే కలపాలి. పిండి రుబ్బుతున్నప్పుడు లేదా వెంటనే కలపకూడదు.
ఉప్పు, ఉల్లిపాయల నుంచి నీరు విడుదలై పిండి పల్చబడుతుంది. అప్పుడు వడ ఆకారం సరిగా రాదు.
నూనె బాగా వేడి అయిన తర్వాత, వడలు వేయించేటప్పుడు మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించాలి.
ఎక్కువ మంటపై వేయిస్తే బయట వెంటనే రంగు మారి మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మధ్యస్థ మంటపై వేయిస్తే లోపల, బయట సమానంగా ఉడుకుతాయి.
వడలు నూనె నుంచి తీసిన వెంటనే, అవి చల్లారే వరకు లేదా వేడి తగ్గే వరకు వాటిపై మూత అస్సలు పెట్టకూడదు.
వేడి కారణంగా వచ్చే తేమ వడల బయటి పొరను త్వరగా మెత్తగా మారుస్తుంది.

































