రెండు ఉప్పు రవ్వలు ఎంత పరిమాణంలో ఉంటాయి?
కంటికి అతి సమీపంలో పెట్టుకొని చూస్తే కానీ కనిపించనంత కదా? అంత తక్కువ పరిమాణంలో తిన్నా మనిషిని చంపగల విషం ఒకటుంది.. అదే రెసిన్. ఈ విషానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడే లేదు. అది శరీరంలోకి వెళ్తే 36 నుంచి 72 గంటల్లో మనిషి చనిపోతాడు. మనదేశంలో విఽధ్వంసం సృష్టించాలని కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు ప్రమాదకరమైన ఈ విషంపై కన్నేశారు. ఇటీవల గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాదీ వైద్యుడు మొహియుద్దీన్ రెసిన్‌ను తయారుచేసే పనిలో ఉన్నట్లు తేలటంలో నిఘా, దర్యాప్తు వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
ఆముదం గింజల నుంచి తయారీ..
రెసిన్‌ను ఆముదం గింజల నుంచి తయారుచేస్తారు. దీనిని సాధారణ వ్యక్తులు తయారుచేయటం అంత తేలిక కానప్పటికీ అసాధ్యం మాత్రం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆముదం గింజలను గుజ్జుగా మార్చి ప్రత్యేక విధానంలో దాని నుంచి రెసిన్‌ను తీస్తారు. ఇటీవల గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన మొహియుద్దీన్ వద్ద 4 కిలోల ఆముదం గుజ్జు లభించటంతో తీగ లాగగా రెసిన్ తయారీ విషయం బయటపడింది.
తేలికగా లభ్యం
సాధారణంగా ఆముదాలు ఎవరికైనా తేలికగా లభిస్తాయి. మనదేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులు ఆముదం పంట పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాల్లో కొంతకాలం క్రితం వరకు ఇది ప్రధాన పంటగా ఉండేది. హైదరాబాద్‌లోని మూసీ నది వెంట చిత్తడి ప్రాతాల్లో ఆముదం మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ ఆముదాలు అమ్ముతున్నారు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండానే ఆర్డర్ చేసిన వెంటనే ఇంటికే డెలివరీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థలుగానీ, నిఘా వర్గాలుగానీ, ప్రభుత్వాలుగానీ ఎవరైనా రెసిన్‌ను దుర్వినియోగం చేస్తే ఎలా అనే అంశంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
విరుగుడే లేదు..
రెసిన్ విషానికి ఇప్పటివరకు సరైన విరుగుడే లేదని వైద్యులు తెలిపారు. శరీరంలో ఈ విషం ఉందా లేదా? అనేది నిర్ధారించటం కూడా అంత తేలిక కాదని చెబుతున్నారు. ‘శరీరంలో రెసిన్‌ను గుర్తించటానికి లిక్విడ్ క్రోమటోగ్రఫీ వంటి ప్రత్యేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఒకేసారి ఎక్కువ మందికి నిర్వహించటం సాధ్యం కాదు. రోగికి ఉన్న లక్షణాలను బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్వాస సంబంధ లక్షణాల ద్వారా రెసిన్ దాడిని తెలుసుకోవటం కాస్త తేలిక. రెసిన్‌కు విరుగుడు లేదు. ఇతర మార్గాల ద్వారా రోగిని బ్రతికించటానికి ప్రయత్నించాల్సిందే. అది కూడా రోగి ఎలా స్పందిస్తున్నాడు అనేదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. రెసిన్‌ను ముక్కు ద్వారా పీల్చితే త్వరగా చనిపోతారు’ అని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నీరజ్ త్యాగి తెలిపారు.
రెండు రవ్వలు చాలు: రెసిన్ కలిసిన రెండు రవ్వల ఉప్పు తిన్నా మనిషి చనిపోతాడు.
రూపం: రెసిన్‌ను పౌడర్‌గా, తేలికగా ఆవిరయ్యే సెమీ లిక్విడ్ (పొగమంచులాగా)గా, పెల్లెట్లుగా కూడా తయారు చేయవచ్చు. ఇది నీటిలో, మామూలు యాసిడ్‌లో తేలికగా కలిసిపోతుంది.
ఎలా పనిచేస్తుంది?: శరీరం జీవ కణాలతో నిర్మితమై ఉంటుంది. ఆ కణాల మనుగడకు ప్రొటీన్ అవసరం. రెసిన్ శరీరంలోకి వెళ్లగానే జీవకణాల్లోకి ప్రొటీన్ వెళ్లకుండా అడ్డుకుంటుంది. దీంతో జీవకణం చనిపోతుంది. అలా శరీరంలోని ఒక్కో అవయవం పాడవుతుంది. చివరకు రెసిన్ శరీరంలోకి ప్రవేశించిన 36 నుంచి 72 గంటల్లో (విషం శరీరంలోకి ప్రవేశించే విధానాన్ని బట్టి) మనిషి మరణిస్తాడు.
గతంలో బయటపడిన ‘రెసిన్’ ఘటనలు..
- 1978 సెప్టెంబర్‌లో లండన్‌లో బల్గేరియన్ తిరుగుబాటు నేత జార్జీ మార్కోవ్‌ను రెసిన్ పెల్లెట్ పేల్చి హత్యచేశారు.
- 2024 జూలైలో బ్రిటన్‌లోని సౌత్‌పోస్ట్ ప్రాంతంలో కత్తిపోట్లకు పాల్పడిన దుండగులు రెసిన్‌ను కూడా తయారుచేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో బయటపడింది.
- 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు వచ్చిన ఒక పార్సిల్‌లో రెసిన్‌ను గుర్తించారు.
- 2018 జూన్‌లో జర్మనీలోని కలాగ్నేలో సైఫ్ అల్లాహ్ అనే ఓ ట్యునీషియా జాతీయుడు, అతడి భార్య కలిసి ఇంట్లోని వంటగదిలోనే కాఫీ గ్రైండర్ ద్వారా రెసిన్‌ను తయారుచేసేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. వీరు భారీ మొత్తంలో ఆముదం గింజలను కొనటంతో అనుమానం వచ్చిన పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు చేయగా విషయం బయటపడింది. వీరికి ఐఎ్‌సఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
లక్షణాలు
- ముక్కుద్వారా రెసిన్ శరీరంలోకి వెళ్తే శ్వాస తీసుకోటంలో తీవ్ర సమస్య ఏర్పడుతుంది. దీంతో రోగి త్వరగా మరణిస్తాడు.
- నోటిద్వారా రెసిన్‌ను తీసుకుంటే వాంతులు, విరేచనాలు అవుతాయి. కాలేయం, మూత్రపిండాలు త్వరగా పాడవుతాయి.
- ఇంజెక్షన్ ద్వారా ఇది శరీరంలోకి వెళ్తే అవయవాలన్నింటినీ త్వరగా నాశనం చేస్తుంది.






























