జీరో అకౌంట్ ఉన్నవారికి శుభవార్త చెప్పిన RBI.. ఉచితంగా అన్నీ సేవలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మరిన్ని మెరుగైన సేవలు అందించేలా కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి అలాంటి అకౌంట్లకు ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(BSBD) కలిగి ఉన్నవారికి తీపికబురు అందించింది. ఇకపై ఈ అకౌంట్ల నుంచి చేసే డిజిటల్ లావాదేవీలపై లిటిట్ ఎత్తేసింది. ఇక నెలవారీగా ఎంతైనా నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అంటే ఇకపై డిపాజిట్లపై ఎలాంటి పరిమితులు ఉండవు. దీంతో పాటు డిపాజిట్ ఫీజును కూడా ఎత్తివేస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ అకౌంట్ ఉన్నవారికి నెలకు నాలుగుసార్లు ఫ్రీగా ఏటీఎం విత్ డ్రా సేవలు ఉపయోగించుకునే అవకాశంతో పాటు వార్షిక ఫీజు లేకుండా డెబిట్ కార్డు అందించాలని సూచించింది.


ఉచిత సేవలు

ఇక ఏడాదికి 25 చెక్ లివ్స్, ఫ్రీగా పాస్‌బుక్, స్టేట్‌మెంట్స్ పొందే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. అలాగే ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఇక డిజిటల్ చెల్లింపులకు ఎలాంటి జరిమానా విధించకుండా రూల్స్ తీసుకొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న BSBD కస్టమర్లతో పాటు కొత్తగా అకౌంట్ తీసుకునేవారికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయిన స్పష్టం చేసింది. ఇక సాధారణ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నవారు కూడా దానిని BSBD అకౌంట్‌గా మార్చుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 1,2025న తెచ్చిన నిబంధనలు, ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయల ఆధారంగా రూల్స్‌ మార్చినట్లు పేర్కొంది. డిజిటల్ ట్రాన్సక్షన్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న కారణంగా జీరో అకౌంట్స్ ఉన్నవారికి ఫ్రీగా సాధారణ సర్వీసులు అందించాలనే ఉద్దేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

బలవంతం చేయకూడదు

ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, డిజిటల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకునేలా కస్టమర్లను బ్యాంకులు బలవంతం చేయకూడదని ఆర్‌బీఐ తెలిపింది. అభ్యర్థన మేరకు మాత్రమే వారికి అందించాలంది. ఎటువంటి వివక్షత లేకుండా కనీస బ్యాలెన్స్ షరతు విధించకుండా పారదర్శకంగా అకౌంట్లను నిర్వహించాలని సూచించింది. సాధారణ సేవింగ్స్ అకౌంట్‌ను జీరో అకౌంట్‌గా మార్చుకునే అవకాశం ఇవ్వాలని, ఏడు రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయలని తెలిపింది. చాలా బ్యాంకులు జోరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.