తిరుపతిలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్..

తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్‌సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.


రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.

స్క్రబ్‌ టైఫస్‌ అంటే ఏంటి?
స్క్రబ్‌ టైఫస్‌ను బుష్‌ టైఫస్‌ అని కూడా అంటారు. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్‌ టైఫస్‌ వస్తుంది. ముందుగా ఇది ఎలుకలకు సోకుతుంది. వాటిని కుట్టిన నల్లిపైకి ఆ సూక్ష్మజీవులు చేరతాయి. నల్లి మనల్ని కుట్టినప్పుడు స్క్రబ్ టైఫస్ మనుషులను సోకుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండగలదు. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి. కుట్టినచోట మచ్చలతోపాటు దద్దుర్లు ఉంటాయి. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. తమిళనాడులో మారుతున్న వాతావరణ పరిస్థితులు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.

స్క్రబ్‌ టైఫస్‌ని ఎలా గుర్తించాలి?
చర్మంపై కాలిన మచ్చలు, జ్వరం వంటి ప్రాథమిక లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తమవ్వాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ‘ఎలిసా’ అనే రక్తపరీక్ష ద్వారా దీన్ని గుర్తించొచ్చు. పీసీఆర్‌ వంటి మాలిక్యులార్‌ టెస్ట్‌ ద్వారా కూడా శరీరంలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.